LOADING...
Form 16,26AS : ఏప్రిల్‌ 1 నుంచి ఫారం 16,26ASలకు కొత్త పేర్లు.. పన్ను చెల్లింపుదారులకు ఏమి మారుతుంది?
పన్ను చెల్లింపుదారులకు ఏమి మారుతుంది?

Form 16,26AS : ఏప్రిల్‌ 1 నుంచి ఫారం 16,26ASలకు కొత్త పేర్లు.. పన్ను చెల్లింపుదారులకు ఏమి మారుతుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్‌ 1 నుంచి ఫారం 16, 26ASలకు కొత్త పేర్లు రానున్నాయి. కొత్తగా అమలులోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం-2025ను అమలు చేసే దిశగా Income Tax Department డ్రాఫ్ట్‌ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను విడుదల చేసింది. వీటిపై ప్రస్తుతం స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ డ్రాఫ్ట్‌లో ఆదాయపు పన్ను ఫారాలన్నింటికీ కొత్త నంబర్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ఫారం 26ASను ఫారం 168గా, ఫారం 16ను ఫారం 130గా మార్చనున్నారు. ఈ మార్పులు ఏప్రిల్‌ 1 తర్వాత ప్రారంభమయ్యే ట్యాక్స్‌ సంవత్సరాలకు వర్తిస్తాయి.

వివరాలు 

సెక్షన్‌ రిఫరెన్స్‌లు మాత్రమే మారతాయి 

ఏకేఎమ్‌ గ్లోబల్‌కు చెందిన వికాస్‌ శర్మ ప్రకారం, ఇది పూర్తిగా పరిపాలనా, నిర్మాణాత్మక మార్పే తప్ప జీతం పొందే పన్ను చెల్లింపుదారులు లేదా యజమానులపై అదనపు భారం ఉండదన్నారు. ఫ్లై హై ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈఓ బ్రజేష్‌ ప్రణామి కూడా ఇది పన్ను విధానంలో మార్పు కాదని, కేవలం కొత్త చట్టానికి అనుగుణంగా డాక్యుమెంట్లను సర్దుబాటు చేయడమేనని తెలిపారు. బాంబే చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సొసైటీకి చెందిన సీఏ మృణాల్‌ మెహతా మాట్లాడుతూ, పాత ఫారం 16, 26ASల రిపోర్టింగ్‌ ఫార్మాట్‌ కొత్తగా రానున్న ఫారం 130, 168ల్లో కూడా అలాగే ఉంటుందని, కేవలం సెక్షన్‌ రిఫరెన్స్‌లు మాత్రమే మారతాయని చెప్పారు.

వివరాలు 

టీడీఎస్‌ సర్టిఫికేట్‌-ట్యాక్స్‌ పాస్‌బుక్‌.. మధ్య తేడాలు తగ్గే అవకాశం 

ఇక 'ప్రీవియస్‌ ఇయర్‌, అసెస్‌మెంట్‌ ఇయర్‌' అనే పాత పదాల స్థానంలో ఇకపై 'ట్యాక్స్‌ ఇయర్‌' అనే ఒక్క పదమే ఉపయోగించనున్నారు. దీంతో ట్యాక్స్‌ ఇయర్‌ 2026-27 వంటి స్పష్టమైన సూచనలు ఉండి అయోమయం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఫారాలు మరింత డిజిటల్‌గా ఉండేలా రూపొందించడంతో,యజమానులు దాఖలు చేసే త్రైమాసిక వివరాల ఆధారంగా సమాచారం ముందే నింపబడే అవకాశం ఉంది. దీని వల్ల టీడీఎస్‌ సర్టిఫికేట్‌-ట్యాక్స్‌ పాస్‌బుక్‌ (ఫారం 168) మధ్య తేడాలు తగ్గే అవకాశముందని చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

ప్రారంభ దశలో పాత, కొత్త ఫారాలు రెండూ ఉపయోగంలో ఉండే అవకాశం

ఒకే ట్యాక్స్‌ ఇయర్‌లో పలువురు యజమానుల వద్ద పని చేసిన ఉద్యోగులకు, ప్రతి యజమాని తమ కాలానికి సంబంధించిన పార్ట్‌ ఏ, పార్ట్‌ బి రెండింటినీ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రారంభ దశలో పాత, కొత్త ఫారాలు రెండూ కొంతకాలం పాటు ఉపయోగంలో ఉండే అవకాశం ఉందని, సిస్టమ్‌ అప్‌డేట్లు ఆలస్యం అయితే గందరగోళం తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement