మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా
ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. భారతదేశంకు చెందిన అంకితి బోస్ సింగపూర్‌కు చెందిన ఫ్యాషన్ స్టార్టప్ జిలింగో సీఈఓగా కంపెనీని విజయంవంతంగా నడిపించారు. ఆర్థిక అవకతవకలు, దుర్వినియోగం ఆరోపణలతో మే 2022లో జిలింగో కంపెనీ నుంచి అంకితి బోస్‌ను సీఈఓగా తొలగించారు. వాస్తవానికి ప్రారంభించిన కొంతకాలానికి ఈ కంపెనీ తారా జువ్వలా దూసుకుపోయింది. అనతికాలంలోనే జిలింగో కంపెనీని రూ.7వేల కోట్ల విలువ గల కంపెనీగా బోస్ తీర్చి దిద్దారు. కానీ ఆ తర్వాత ఆమె అనూహ్యంగా తొలగించబడ్డారు.
ఔట్‌లుక్ బిజినెస్ మ్యాగజైన్ వ్యాసంపై బోస్ అభ్యంతరాలు
ఔట్‌లుక్ బిజినెస్ మ్యాగజైన్ మార్చి సంచికలో సీడ్‌ఫండ్ సహ వ్యవస్థాపకుడు మూర్తి రాసిన వ్యాసంపై బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాసంలో సీక్వోయా నుంచి తాను డబ్బులు తీసుకున్నారని మూర్తి ఆరోపించారని బోస్ పేర్కొన్నారు. తమ కంపెనీల నుంచి అక్రమంగా డబ్బు తీసుకున్న స్టార్టప్ వ్యవస్థాపకుల గురించి మూర్తి మాట్లాడారు. ఈ క్రమంలో మూర్తి తనపై వ్యాఖ్యలు చేసినట్లు బోస్ ఆరోపించారు. ఆ వ్యాసం ఆధారంగా మూర్తిపై అంకితి బోస్ 100 మిలియన్ డాలర్లకు బాంబై కోర్టులో పరువునష్టం దాఖలు చేశారు.