Four Labour Codes: దేశ కార్మిక వ్యవస్థలో పెద్ద మార్పు.. అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో నాలుగు కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు ఏడు దశాబ్దాల నాటి 29 కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, ప్రభుత్వం శుక్రవారం వేతన కోడ్-2019, ఇండస్ట్రియల్ రిలేషన్‌స్ కోడ్-2020, సోషియల్ సెక్యూరిటీ కోడ్-2020,అలాగే ఓష్‌వక్ (Occupational Safety, Health & Working Conditions)కోడ్-2020లను అమలు చేసింది. ఇది దేశంలోని కార్మిక పాలనను ఆధునికీకరించే దిశగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని కేంద్రం తెలిపింది. నవంబర్ 21, 2025 నుంచి ఇవి అమల్లోకి వస్తుండటంతో,చాలా ఏళ్లుగా కొనసాగుతున్న చర్చలకు, ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. కొత్త కోడ్లు కార్మికులకు స్పష్టమైన నిబంధనలు, మెరుగైన భద్రత, సామాజిక భద్రతలు కల్పించడంతో పాటు, పరిశ్రమలకు కూడా సరళమైన నియంత్రణ వ్యవస్థను అందిస్తాయని ప్రభుత్వం చెప్పింది.
వివరాలు
మహిళలు అన్ని రంగాల్లో రాత్రిపూట పనిచేసే అవకాశాలు
భారత కార్మిక చట్టాల్లో చాలా వరకు 1930-1950 మధ్య వచ్చినవే కావడంతో, ఇవి నేటి డిజిటల్, గిగ్ ఆధారిత ఉద్యోగాల కాలానికి పూర్తిగా సరిపోలేకపోయాయి. ఈ నేపథ్యంలో నాలుగు కోడ్లు అన్ని విధాలుగా సమగ్ర సవరణగా నిలుస్తున్నాయి. ఇకపై అన్ని కార్మికులకు అపాయింట్మెంట్ లెటర్ తప్పనిసరి కాగా, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్స్‌కూ మొదటిసారి చట్టబద్ధ గుర్తింపు లభించింది. మహిళలు అన్ని రంగాల్లో రాత్రిపూట పనిచేసే అవకాశాలు, భద్రతా నిబంధనలతో కలిపి కల్పించబడాయి. సమయానికి వేతన చెల్లింపు, కనీస వేతనాలు, 40 ఏళ్లు దాటిన వారికి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు వంటి సౌకర్యాలు కోడ్లలో చోటు చేసుకున్నాయి. చిన్న, ప్రమాదకర పరిశ్రమలకూ జాతీయ స్థాయి ESIC సేవలు వర్తించనున్నాయి.
వివరాలు
మరింత బలోపేతం కానున్న గ్రాచ్యుయిటీ, సోషల్ సెక్యూరిటీ, ఆరోగ్య సేవలు
ఒక్క రిజిస్ట్రేషన్,ఒక్క లైసెన్స్,ఒక్క రిటర్న్ సరిపోవడంతో MSMEలకు అనవసరమైన కాగితాల పని తగ్గనుంది. కాంట్రాక్ట్ వర్కర్స్, ఫిక్స్డ్-టర్మ్ ఎంప్లాయీస్, గిగ్ వర్కర్స్.. అందరికీ గ్రాచ్యుయిటీ, సోషల్ సెక్యూరిటీ, ఆరోగ్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి. బీడి, ప్లాంటేషన్, టెక్స్టైల్, డాక్, మైనింగ్ రంగాల కార్మికులకు అదనపు భద్రతా చర్యలు,మెరుగైన వేతనాలు, ఆరోగ్య సంరక్షణ, నియంత్రిత పనిగంటలు, తప్పనిసరి ఓవర్‌టైం చెల్లింపులు అమలులోకి వస్తాయి. IT-ITES రంగాల్లో ప్రతి నెల 7వ తేదీలోపు జీతం తప్పనిసరిగా విడుదల చేయాల్సి ఉంటుంది. జాతీయ ఫ్లోర్ వేజ్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎవరి వేతనం అయినా ఒక స్థాయి కంటే తక్కువగా ఉండకూడదని నిబంధన తీసుకువచ్చారు.
వివరాలు
భద్రతా ప్రమాణాలు ఉండేలా నేషనల్ OSH బోర్డ్ ఏర్పాటు
భవిష్యత్తులో అన్ని రంగాలకు ఒకే భద్రతా ప్రమాణాలు ఉండేలా నేషనల్ OSH బోర్డ్ ఏర్పాటు చేశారు. వివాద పరిష్కారానికి రెండు సభ్యులతో కూడిన కొత్త ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటైంది. 2015లో 19% మాత్రమే ఉన్న సోషల్ సెక్యూరిటీ పరిధి 2025కి 64% దాటిందని, కొత్త కోడ్లు దీనిని ఇంకా విస్తరించనున్నాయని ప్రభుత్వం పేర్కొంది. మార్పుల దశలో పాత చట్టాల కింద ఉన్న నిబంధనలు అవసరమైతే కొనసాగుతాయని, తరువాత కొత్త చట్టాలకు అనుగుణంగా వాటిని మార్చనున్నట్లు స్పష్టం చేసింది.