FPI Investment in Indian Stock Market: భారత మార్కెట్లలో ఎఫ్‌పీఐల జోరు.. నవంబర్‌లో ఆల్‌టైమ్ రికార్డు పెట్టుబడులకు ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కొనుగోళ్ల వేగాన్ని పెంచారు. దాదాపు 10 వారాల పాటు నికర విక్రయదారులుగా కొనసాగిన విదేశీ ఇన్వెస్టర్లు.. నవంబర్ ప్రారంభం నుంచి వరుసగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికే ఏకంగా రూ.79,301 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇదే జోరు కొనసాగితే నవంబర్ నెలలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఏఐ స్టాక్స్ నుంచి ఇతర రంగాల వైపు నిధులు
ఈ పరిణామంపై జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ స్పందించారు.
అమెరికా కాంగ్రెషనల్ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టాక్స్‌లో అమ్మకాలకు కారణమైందని తెలిపారు.
ఏఐ వ్యయాలు, నియంత్రణలకు డెమొక్రాట్లు అనుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు తమ నిధులను ఏఐయేతర రంగాల వైపు మళ్లించారని వివరించారు.
ఈ క్రమంలో మెరుగైన వృద్ధి అవకాశాలున్న భారత మార్కెట్లపై గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
వివరాలు
భారత మార్కెట్లపై పెరుగుతున్న విశ్వాసం
దేశీయ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగుపడటం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది.
2027 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 కంపెనీలు దాదాపు 15 శాతం ఆదాయ వృద్ధిని సాధించే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు భారతీయ లార్జ్‌క్యాప్ షేర్ల విలువలు ఆకర్షణీయమైన స్థాయికి చేరడం, రూపాయి మారకం విలువ స్థిరంగా ఉండటం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోని కీలక లార్జ్‌క్యాప్ షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం సూచీల ర్యాలీకి మద్దతుగా నిలిచింది.
వివరాలు
డీఐఐల అమ్మకాలు.. ఎఫ్‌పీఐల కొనుగోళ్ల జోరు
గత వారం ఎఫ్‌పీఐలు రూ.33,340 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అంతకుముందు వారంలోనూ సుమారు రూ.45,960 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) మాత్రం వరుసగా రెండో వారం కూడా అమ్మకాలకే మొగ్గు చూపారు.
గత వారంలోని నాలుగు ట్రేడింగ్ సెషన్లలో డీఐఐలు రూ.24,190 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
డీఐఐలు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్ ర్యాలీ కొంత నెమ్మదించినప్పటికీ.. ఎఫ్‌పీఐల నుంచి వస్తున్న బలమైన కొనుగోళ్లు భారత ఈక్విటీ మార్కెట్లకు భారీ ఊతాన్ని ఇస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.