Gold prices in India: పసిడి ధర తగ్గింది.. పండగ వేళ కొనుగోళ్లు పెరిగాయ్!
ఈ వార్తాకథనం ఏంటి
గరిష్ఠ స్థాయిల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో దీపావళి, ధనత్రయోదశి పండగల సమయంలో భారతీయ వినియోగదారులు బంగారం, వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి పసిడి కొనుగోళ్లు పరిమాణం పరంగా 30 శాతం, వెండి కొనుగోళ్లు 10 శాతం పెరిగినట్లు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించింది. ఐబీజేఏ అంచనా ప్రకారం.. ఈ ఏడాది ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా వినియోగదారులు సుమారు రూ.72,000 కోట్ల విలువైన 52 టన్నుల బంగారం, రూ.5,400 కోట్ల విలువైన 300 టన్నుల వెండిని కొనుగోలు చేశారు. 10 గ్రాముల బంగారం ధర గతంలో గరిష్ఠంగా రూ.1.8లక్షలకు చేరగా.. ప్రస్తుతం భారీగా తగ్గి రూ.1.40 లక్షల వద్ద అటూఇటుగా కదలాడుతోంది.
వివరాలు
ధర తగ్గడంతో పెరిగిన కొనుగోళ్లు
రాబోయే వివాహాల సీజన్‌కు ముందు పసిడికి గిరాకీ మరింతగా పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ధర తగ్గడంతో పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు ముందుగానే బంగారం కొనుగోళ్లు జరుపుతుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పసిడి ధరలు భారీగా పెరగడంతో ప్రజలు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన నేపథ్యంలో చాలామంది వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మోహతా తెలిపారు.
ఇప్పుడు ధర తగ్గడంతో అప్పట్లో వాయిదా వేసుకున్న కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకొస్తున్నారని ఓ ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు.
వివరాలు
ధర మరింత పెరుగుతుందన్న అంచనాతో ముందస్తు కొనుగోళ్లు
భవిష్యత్తులో పసిడి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో వినియోగదారులు ప్రస్తుత ధరల వద్దే ముందస్తుగా కొనుగోళ్లు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
దీంతో బంగారం కొనుగోళ్లకు అనుకూల పరిస్థితులు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ధనత్రయోదశి, దీపావళి ఈ నెల ప్రారంభంలో రావడం కూడా కొనుగోళ్లకు కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్యోగులకు జీతాలు, పండగ బోనస్‌లు అందడంతో మార్కెట్‌లో నగదు ప్రవాహం పెరిగిందని.. దీంతో వినియోగదారులు ఉత్సాహంగా బంగారం, వెండి కొనుగోళ్లు చేసేందుకు అవకాశం ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.