N Chandrasekaran Journey: ఇంటర్న్‌గా అడుగుపెట్టి.. టాటా సన్స్ ఛైర్మన్‌గా: చంద్రశేఖరన్ ప్రస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. టెక్నాలజీపై ఆసక్తితో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఓ సాధారణ ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రయాణం.. టాటా గ్రూప్‌లో అత్యున్నత నాయకత్వ స్థాయికి చేర్చింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు టాటా సంస్థతో అనుబంధాన్ని కొనసాగించిన ఎన్ చంద్రశేఖరన్.. ఇప్పుడు టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సుదీర్ఘ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే..
వివరాలు
కార్పొరేట్ రంగానికి భిన్నంగా..
తమిళనాడులోని మోహనూర్ అనే చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో 1963లో ఎన్ చంద్రశేఖరన్ జన్మించారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన..కోయంబత్తూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
చిన్ననాటి నుంచే ప్రోగ్రామింగ్,టెక్నాలజీపై ఆసక్తి చూపించిన చంద్రశేఖరన్.. ఆ తర్వాత ఎంసీఏ పట్టా పొందారు.
1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్‌గా చేరి తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
అక్కడి నుంచే టాటా సంస్థతో ఆయన ప్రయాణం మొదలైంది.సాధారణంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగులు కొన్నేళ్లకు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారుతుంటారు.
అయితే చంద్రశేఖరన్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు.
ఒకే కంపెనీలో దాదాపు 40ఏళ్లపాటు కొనసాగుతూ.. టాటా సంస్థపై తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.
వివరాలు
46 ఏళ్లకే టీసీఎస్ సీఈఓగా..
టీసీఎస్‌లో చేరిన తర్వాత చంద్రశేఖరన్ అంచెలంచెలుగా ఎదిగారు.
2007లో సంస్థ బోర్డులో సభ్యుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత కేవలం రెండేళ్లకే, 2009లో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
అప్పటికి ఆయన వయసు 46 సంవత్సరాలు మాత్రమే.
దీంతో టాటా గ్రూప్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా చంద్రశేఖరన్ గుర్తింపు పొందారు.
వివరాలు
ఆర్థిక సంక్షోభం నుంచి టీసీఎస్‌కు ఊరట..
చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం ఐటీ రంగంపైనా పడింది.
ఆ ప్రతికూల పరిస్థితుల్లో సంస్థను ముందుకు నడిపించడం ఆయనకు పెద్ద సవాలుగా మారింది.
తన నాయకత్వ సామర్థ్యంతో టీసీఎస్‌ను ఆ సంక్షోభం నుంచి బయటపడేసిన చంద్రశేఖరన్.. సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన హయాంలో టీసీఎస్ వార్షిక ఆదాయం 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. దీంతో దేశంలో అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటిగా టీసీఎస్ ఎదిగింది.
వివరాలు
టాటా సన్స్ ఛైర్మన్‌గా రెండు దఫాలు..
సైరస్ మిస్త్రీ, టాటా గ్రూప్ మధ్య తలెత్తిన వివాదం తర్వాత సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంది.
ఈ సమయంలో చంద్రశేఖరన్ టాటా సన్స్ నాయకత్వ బాధ్యతలను చేపట్టారు.
2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులోకి వచ్చిన ఆయన.. 2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
టాటా కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా, అలాగే పార్సీ కాని వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
చంద్రశేఖరన్ పనితీరును గుర్తించిన టాటా గ్రూప్.. 2022లో ఆయనను మరోసారి ఛైర్మన్‌గా కొనసాగించింది.
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాతో చంద్రశేఖరన్‌కు అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది.
వివరాలు
ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాల చేతుల్లోకి..
చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా గ్రూప్ పలు కొత్త రంగాల్లో విస్తరించింది.
సెమీకండక్టర్ తయారీతో పాటు టాటా డిజిటల్ ఆధ్వర్యంలో ఓమ్నీచానల్ ప్లాట్‌ఫాం టాటా న్యూను ప్రారంభించింది.
ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, ఫార్మసీ, ఫ్యాషన్ తదితర రంగాల్లో పలు సంస్థల కొనుగోళ్లను చేపట్టింది.
అయితే చంద్రశేఖరన్ హయాంలో అత్యంత గుర్తుండిపోయే పరిణామాల్లో ఎయిరిండియా తిరిగి టాటా గ్రూప్ చేతుల్లోకి రావడం ఒకటి.
ప్రభుత్వానికి చెందిన ఎయిరిండియాను తిరిగి టాటాల ఆధీనంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
2022లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎయిరిండియా, విస్తారా విలీనానికి కూడా ఆయన నాయకత్వం వహించారు.
దీంతో ఏవియేషన్ రంగంలో టాటా గ్రూప్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది.
వివరాలు
మారథాన్ రన్నర్ కూడా..
చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా గ్రూప్ ఆదాయం దాదాపు రెండింతలైంది. అదే సమయంలో సంస్థ నికర లాభం, మార్కెట్ విలువ మూడింతలకు పైగా పెరగడం విశేషం.
కార్పొరేట్ ప్రపంచంలో టెక్నాలజీ నిపుణుడిగా, అగ్ర నాయకుడిగా చంద్రశేఖరన్ అందరికీ సుపరిచితమే.
అయితే ఆయనలోని మరో కోణం గురించి చాలా కొద్దిమందికే తెలుసు.
చంద్రశేఖరన్ ఓ మారథాన్ రన్నర్ కూడా. 40ఏళ్ల వయసులో మధుమేహం రావడంతో ఆయన తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
వివరాలు
2022లో పద్మభూషణ్
వైద్యుల సూచనతో రన్నింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా మారథాన్ పరుగుల్లో పాల్గొనడం మొదలుపెట్టారు.
బోస్టన్, న్యూయార్క్, లండన్, ముంబయి వంటి నగరాల్లో నిర్వహించిన పలు మారథాన్లను ఆయన పూర్తి చేశారు.
వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో ఎన్ చంద్రశేఖరన్‌ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.