Loading...
Nestle: నెస్లే ఇండియాపై FSSAI చర్యలు.. శిశు ఆహార ఉత్పత్తుల ప్రమోషన్‌పై అభ్యంతరం
నెస్లే ఇండియాపై FSSAI చర్యలు.. శిశు ఆహార ఉత్పత్తుల ప్రమోషన్‌పై అభ్యంతరం

Nestle: నెస్లే ఇండియాపై FSSAI చర్యలు.. శిశు ఆహార ఉత్పత్తుల ప్రమోషన్‌పై అభ్యంతరం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా లిమిటెడ్‌పై ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) చట్టపరమైన చర్యలు చేపట్టింది. శిశు ఆహార ఉత్పత్తులకు సంబంధించిన నిబంధనలను పాటించడంలో విఫలమైనట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకుంది. నాన్‌ ఎక్సెల్లా ప్రో స్టేజ్‌ 1, లాక్టోజన్‌ ప్రో 1, మరో ఫాలోఅప్‌ ఫార్ములాకు సంబంధించి ఈ-కామర్స్‌ వేదికలపై ప్రచార సామగ్రిని గుర్తించినట్లు FSSAI వెల్లడించింది.

వివరాలు 

ప్రమోషనల్‌ ప్రకటనలపై అభ్యంతరం

నాన్‌ ఎక్సెల్లా ప్రో స్టేజ్‌ 1 ఉత్పత్తిలో 5HMOs, వే ప్రోటీన్‌ ఉన్నాయని, లాక్టోజన్‌ ప్రో 1లోని వే ప్రోటీన్‌ సులభంగా జీర్ణమవుతుందని నెస్లే ఇండియా పేర్కొన్నట్లు FSSAI తెలిపింది.

అయితే, శిశు ఆహార ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేసే ఇలాంటి ప్రకటనలు ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ రెగ్యులేషన్‌-2020 ప్రకారం నిషేధితమని స్పష్టం చేసింది.

అదనంగా, శిశు ఆహారానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకూడదని 1992 నాటి చట్టం కూడా నిర్దేశిస్తోందని FSSAI పేర్కొంది.

ఈ నిబంధనలకు విరుద్ధంగా నెస్లే ఇండియా వ్యవహరించిందని తెలిపింది.

వివరాలు 

బయోటిన్‌ నాణ్యతపైనా అభ్యంతరం

నెస్లే ఇండియా తయారు చేసిన ఫార్ములా ఉత్పత్తిలో బయోటిన్‌ పదార్థం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని FSSAI గుర్తించింది.

ఈ అంశంతో పాటు ప్రమోషనల్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం మూడు వేర్వేరు అడ్జూడికేషన్‌ కేసులను నమోదు చేసింది.

కంపెనీ నుంచి వివరణ తీసుకున్న అనంతరం ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

షేర్లపై ప్రభావం

FSSAI చర్యల నేపథ్యంలో నెస్లే ఇండియా షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో కంపెనీ షేరు 2 శాతం నష్టంతో రూ.1,345 వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT