wholesale inflation: మేలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన ధరల మంటతో 30% దాటిన ద్రవ్యోల్బణం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో భారీగా పెరిగి 9.68 శాతానికి చేరుకుంది. ఏప్రిల్‌లో ఇది 8.30 శాతంగా ఉండగా, ఇంధనంతో పాటు ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్కెట్ అంచనాలను మించి టోకు ద్రవ్యోల్బణం నమోదైంది. ఇంధన, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 24.89 శాతం ఉండగా, మేలో 30.33 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా ముడి చమురు,సహజ వాయువు ధరలు 61.51 శాతం పెరగడం ప్రభావం చూపింది.
వివరాలు
ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.99 శాతం
ఇదే సమయంలో ప్రభుత్వ చమురు సంస్థలు మేలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచడంతో రవాణా, లాజిస్టిక్స్ వ్యయాలు కూడా అధికమయ్యాయి. దీంతో అన్ని రంగాలపై ఖర్చుల భారం పెరుగుతోంది. ఆహార వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి. టోకు స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.11 శాతం ఉండగా, మేలో 4.49 శాతానికి చేరుకుంది. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 3.78 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగింది. రుతుపవనాలు ఆశించిన మేర లేకపోతే రానున్న రోజుల్లో ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
తయారీ రంగ ద్రవ్యోల్బణం 7.48 శాతం
ఇంధన ధరల పెరుగుదల పరిశ్రమల ఉత్పత్తి వ్యయాలపై కూడా ప్రభావం చూపుతోంది. తయారీ రంగ ద్రవ్యోల్బణం 6.68 శాతం నుంచి 7.48 శాతానికి పెరిగింది. రసాయనాలు,వస్త్రాలు,యంత్రాలు,ప్రాథమిక లోహాల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. ప్రాథమిక లోహాల ద్రవ్యోల్బణం 12.3 శాతం,రసాయన ఉత్పత్తుల్లో 13.4 శాతం,వస్త్ర తయారీ రంగంలో 10.22 శాతం నమోదైంది. ఇటీవల విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఇదే ధోరణిని సూచించాయి. మేలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.93శాతానికి చేరుకుంది. పెరుగుతున్న ఆహార,ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వు బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి పెంచింది.
వివరాలు
మే నెల గణాంకాలు కొత్త టోకు ద్రవ్యోల్బణ సూచీ విధానంలో విడుదలైన తొలి నివేదిక
టోకు స్థాయిలో పెరుగుతున్న ధరల ప్రభావం భవిష్యత్తులో వినియోగదారులపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. మే నెల గణాంకాలు కొత్త టోకు ద్రవ్యోల్బణ సూచీ విధానంలో విడుదలైన తొలి నివేదిక కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం బేస్ ఇయర్‌ను 2011-12 నుంచి 2022-23కు మార్చడంతో పాటు సూచీలోని వస్తువుల సంఖ్యను 697 నుంచి 957కు పెంచింది. సౌర, పవన, అణు విద్యుత్ వంటి కొత్త ఇంధన వనరులను చేర్చడమే కాకుండా, ముడి చమురు, సహజ వాయువును ఇంధన విభాగంలోకి మార్చింది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితులను మరింత సమగ్రంగా ప్రతిబింబించేలా కొత్త డబ్ల్యూపీఐ విధానం రూపొందించినట్లు అధికారులు తెలిపారు.