Fuel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో త్వరలోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. లీటర్‌కు సుమారు ₹4 నుంచి ₹5 వరకు పెరుగుదల ఉండొచ్చని, అదే సమయంలో గృహ వినియోగ LPG సిలిండర్ ధర ₹40 నుంచి ₹50 వరకు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇది అమల్లోకి వస్తే దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదలగా భావించాలి,ఎందుకంటే 2022 నుంచి రిటైల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పెరగడం, సరఫరా అంతరాయం భయం, షిప్పింగ్ రిస్క్‌లు వంటి కారణాలతో ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి పెరిగింది.
వివరాలు
5 నుంచి 7 రోజుల్లో ధరల పెంపుపై తుది నిర్ణయం
ఇప్పటివరకు ధరలు పెంచకుండా ఉండటంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను భరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా సబ్సిడీలు లేదా పన్ను తగ్గింపులతో వినియోగదారులకు ఊరట ఇవ్వడం కష్టంగా మారింది. ప్రస్తుతం పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తూ ఉండగా, వచ్చే 5 నుంచి 7 రోజుల్లో ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ధరలు పెంచితే ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, రవాణా వ్యయాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సమతుల్యత పాటించే ప్రయత్నం చేస్తోంది.