వరల్డ్ టాప్10 సంపన్నుల జాబితా నుంచి అదానీ ఔట్
భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితాలో చోటు కోల్పోయారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థలకు సంబంధించిన షేర్లు పతనవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టాప్ -5లో చోట కోల్పోయిన అదానీ, తాజాగా టాప్-10లోనూ స్థానాన్ని కోల్పోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే, ఆసియా టాప్ 1 స్థానాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుందని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆరోపణల తర్వాత అదానీ కంపెనీలు 68 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయినట్లు సంపదను కోల్పోవల్సి వచ్చిందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. కేవలం మూడు రోజుల్లో ఇంత భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
84.4 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో అదానీ
ప్రపంచ కుబేరుల జాబితాలో 84.4 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మరో భారతీయ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 82.2 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రస్తుతం అదానీ కంటే ముందు మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ ఉన్నారు. అదానీ టోటల్ గ్యాస్ షేరు నాలుగు( సోమవారంతో కలుపుకొని)రోజుల్లో కలిపి దాదాపు 45శాతం విలువ ఆవిరైపోయింది. గ్రీన్‌ఎనర్జీ 38శాతం, టోటల్ ట్రాన్స్‌మిషన్ 36.9శాతం, పోర్ట్స్ 19.5శాతం, పవర్ 18.5శాతం షేర్లు పతనమయ్యాయి.