
టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేశారు; హిండెన్‌బర్గ్ నివేదికపై గౌతమ్ అదానీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో అదానీ గ్రూప్‌పై ఇచ్చిన నివేదికపై చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు.
అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో స్వార్థ ప్రయోజనాల కోసం హిండెన్‌బర్గ్ తమపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ వాటాదారులకు ఇచ్చిన సందేశంలో గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ నివేదికపై మండిపడ్డారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)కు సిద్ధమైన సమయంలో అదును చూసి హిండెన్‌బర్గ్ నివేదికను విడుదల చేసిందని పేర్కొన్నారు.
ఒకవేళ సకాలంలో ఎఫ్‌పీఓ పూర్తయి ఉంటే ఇది భారతదేశ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద కంపెనీగా రికార్డు సృష్టించేదని చెప్పారు.
అదానీ
ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినా ఇన్వెస్టర్లకు డబ్బును తిరిగి ఇచ్చేశాం: అదానీ
ఎఫ్‌పీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినప్పటికీ పెట్టుబడిదారులకు డబ్బును తిరిగి ఇచ్చి, వారి ప్రయోజనాలను కాపాడినట్లు అదాని వివరించారు.
అదానీ గ్రూప్ స్టాక్ ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడం ద్వారా హిండెన్‌బర్గ్ లాభాలను ఆర్జించిందని అదానీ వాటాదారులకు ఇచ్చిన సందేశంలో వివరించారు.
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం హిండెన్‌బర్గ్ ఆరోపణలను పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
మే 2023లో కమిటీ ఓ నివేదికను ఇచ్చింది. అందులో అదానీ గ్రూప్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. జనవరి 24న హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ షేర్లు గణనీయమైన పతనాన్ని చూశాయి.