Gig Workers: గిగ్ కార్మికులకు సామాజిక భద్రత.. బీమా, ఆరోగ్య రక్షణ సహా కేంద్రం కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రమాద బీమా,ఆరోగ్య రక్షణ,ప్రసూతి ప్రయోజనాలు, వృద్ధాప్య భద్రత వంటి పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే జూన్ 22లోపు ప్లాట్‌ఫామ్ కంపెనీలు తమ కార్మికుల వివరాలను ఈ-శ్రమ్ (e-Shram) పోర్టల్‌తో అనుసంధానం చేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆదేశించింది.
వివరాలు
గిగ్ ఎకానమీకి భారీ భవిష్యత్తు
ఎఫ్‌ఐసీసీఐ (FICCI)లో నిర్వహించిన గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులపై సంప్రదింపుల సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (లేబర్ వెల్ఫేర్) అశుతోష్ పెడ్నేకర్ మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో దాదాపు కోటి మంది గిగ్ కార్మికులు పనిచేస్తున్నారని, ఈ దశాబ్దం ముగిసే నాటికి ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరుకునే అవకాశముందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు గిగ్ రంగం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు.
వివరాలు
జాతీయ సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం జాతీయ సామాజిక భద్రతా బోర్డు (National Social Security Board) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పెడ్నేకర్ వెల్లడించారు. సామాజిక భద్రతా కోడ్‌లోని నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన నియమాలు, వ్యవస్థలను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక సామాజిక భద్రతా నిధి గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ప్రత్యేక సామాజిక భద్రతా నిధిని కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తోంది. ఈ నిధి ద్వారా కార్మిక సంక్షేమ పథకాలకు ఆర్థిక వనరులు సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
కార్మికులకు లభించే ప్రయోజనాలివే
ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రయోజనాల్లో ప్రమాద బీమా, వృద్ధాప్య రక్షణ, ఆరోగ్య ప్రయోజనాలు, ప్రసూతి సదుపాయాలు, నగదు సహాయం వంటి అంశాలు ఉన్నాయి. అదనంగా విద్యా రుణాల సహాయం, అంత్యక్రియల ఖర్చులకు మద్దతు వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అందించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ పథకాల అమలుకు సంబంధించిన విధివిధానాలపై నిధుల నిర్వాహకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కార్మికులు-పరిశ్రమల మధ్య సమతుల్యతకు ప్రయత్నం ఒకవైపు కార్మికులు సామాజిక భద్రత కోరుతుండగా, మరోవైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో సౌలభ్యం కొనసాగాలని పరిశ్రమలు కోరుతున్నాయని పెడ్నేకర్ చెప్పారు. ఈ రెండు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
e-Shramతో అనుసంధానం కీలకం
ప్రభుత్వ వ్యూహంలో ప్రధాన భాగంగా ప్లాట్‌ఫామ్ కంపెనీల డేటాబేస్‌లను e-Shram పోర్టల్‌తో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల కార్మికులు పొందుతున్న సంక్షేమ ప్రయోజనాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మొబైల్ యాప్ ద్వారా తమకు లభించే ప్రయోజనాలు, వాటి వినియోగ వివరాలను కార్మికులు సులభంగా తెలుసుకోగలరని చెప్పారు.
వివరాలు
యువతకు ఉపాధిలో గిగ్ రంగం కీలక పాత్ర
భారత్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాదిరిగానే e-Shram వ్యవస్థ కూడా సంక్షేమ పథకాల అమలులో కీలక మార్పులు తీసుకురాగలదని పెడ్నేకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పనలో గిగ్, ప్లాట్‌ఫామ్ ఎకానమీ ప్రధాన పాత్ర పోషిస్తోందని,రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగ మార్కెట్‌లో ఈ రంగం ప్రాధాన్యం మరింత పెరుగుతుందని తెలిపారు. జూన్ 22లోపు అన్ని ప్లాట్‌ఫామ్ కంపెనీలు e-Shramతో అనుసంధానం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.