LOADING...
Global brand value: గ్లోబల్‌ బ్రాండ్లలో టాప్‌ యాపిల్‌.. ఐదో స్థానంలో శాంసంగ్ 
గ్లోబల్‌ బ్రాండ్లలో టాప్‌ యాపిల్‌..ఐదో స్థానంలో శాంసంగ్

Global brand value: గ్లోబల్‌ బ్రాండ్లలో టాప్‌ యాపిల్‌.. ఐదో స్థానంలో శాంసంగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్‌ బ్రాండ్‌ విడుదల చేసిన తాజా 'బెస్ట్‌ గ్లోబల్‌ బ్రాండ్స్‌' జాబితాలో ఆపిల్‌ మరోసారి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం సాధించింది. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్‌, మూడో స్థానంలో అమెజాన్‌, నాలుగో స్థానంలో గూగుల్‌, ఐదో స్థానంలో శాంసంగ్‌ నిలిచాయి. సెమీకండక్టర్‌ దిగ్గజం ఎన్విడియా గత ఏడాది 36వ స్థానంలో ఉండగా, ఈసారి 15వ స్థానానికి ఎగబాకి వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. కంపెనీల ఆర్థిక ఫలితాలు, వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై బ్రాండ్‌ ప్రభావం, అలాగే పోటీ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్‌ను నిర్ణయించారు.

వివరాలు 

2020 ప్రపంచ టాప్‌-5 బ్రాండ్లలో స్థానం నిలుపుకున్న శాంసంగ్

దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ వరుసగా ఆరో ఏడాది కూడా ఐదో స్థానాన్ని కొనసాగించింది. 2020 నుంచి ప్రపంచ టాప్‌-5 బ్రాండ్లలో స్థానం నిలుపుకున్న ఏకైక ఆసియా కంపెనీగా గుర్తింపు పొందింది. ఈ విజయంపై శాంసంగ్‌ మార్కెటింగ్‌ హెడ్‌ లీ వాన్‌-జిన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ, వినియోగదారులకు ప్రతిరోజూ ఏఐ అనుభూతి అందించేందుకు సంస్థ నిరంతరం కొత్త ఆవిష్కరణలను కొనసాగిస్తుందని తెలిపారు. కొరియాకు చెందిన మరో కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ 24.6 బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువతో ఈ జాబితాలో 30వ స్థానాన్ని దక్కించుకుంది. కొరియా సంస్థల్లో ఇది రెండో అత్యుత్తమ స్థానం.

వివరాలు 

2010 నుంచి తన బ్రాండ్‌ విలువను క్రమంగా పెంచుకుంటూ వస్తున్న హ్యుందాయ్

2005లో తొలిసారి గ్లోబల్‌ టాప్‌-100 బ్రాండ్లలో ప్రవేశించిన హ్యుందాయ్‌, 2010 నుంచి తన బ్రాండ్‌ విలువను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. మరోవైపు కియా కూడా ఈసారి టాప్‌ 100 జాబితాలో చోటు సంపాదించి 89వ స్థానంలో నిలిచింది. జపాన్‌ కంపెనీలలో టయోటా 6వ స్థానంలో, సోనీ 34వ స్థానంలో, యూనిక్లో 47వ స్థానంలో, నింటెండో 53వ స్థానంలో నిలిచాయి. చైనాకు చెందిన కంపెనీలలో షావోమి 81వ స్థానం, బీవైడీ 90వ స్థానం, హువావే 96వ స్థానం పొందాయి.