Stock Market: దేశీయ మార్కెట్లు బేర్‌గుప్పిట్లోకి…సెన్సెక్స్ 830 పాయింట్లు పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలంగా ప్రభావితం చేశాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) వరుసగా షేర్లు విక్రయిస్తుండటం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరగడం కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు బేర్ గుప్పిట్లోకి వెళ్లాయి. ఇక భారత్‌తో పాటు 16 దేశాల వాణిజ్య విధానాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం కొత్త టారిఫ్‌ల భయాలను పెంచింది.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.17గా నమోదు
ఈ కారణాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పతనమైందీ. నిఫ్టీ కూడా 23,650 స్థాయి కంటే దిగువకు జారింది. సెన్సెక్స్ ఉదయం 76,369.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గత ముగింపు 76,863.71 పాయింట్లు. ప్రారంభం నుంచే నష్టాల్లోనే సాగిన సూచీ.. ఇంట్రాడేలో 75,871.18 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 829.29 పాయింట్లు కోల్పోయి 76,034.42 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 227.70 పాయింట్లు తగ్గి 23,639.15 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.17గా నమోదైంది. సెన్సెక్స్ 30 షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.
వివరాలు
కారణాలు ఇవీ..
అయితే ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ షేర్లు లాభాల్లో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 96.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో బంగారం ఔన్సు ధర 5185 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు ధరల పెరుగుదల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో చమురు సరఫరా అంతరాయం ఎదుర్కొంటోంది. వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాలని కొన్ని దేశాలు నిర్ణయించినప్పటికీ గురువారం చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లను కూడా దాటింది.
వివరాలు
అమెరికా మార్కెట్ల ప్రభావం:
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో నాస్‌డాక్ మినహా మిగతా సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం గురువారం ఆసియా మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్‌పైనా పడింది. కొత్త టారిఫ్‌ల భయాలు: ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అమెరికా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అన్యాయమైన వాణిజ్య విధానాలు అనుసరిస్తున్నాయని ఆరోపిస్తూ భారత్‌తో పాటు 16 దేశాల ఆర్థిక వ్యవస్థలపై దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. ఈ చర్య భవిష్యత్తులో కొత్త టారిఫ్‌లు విధించే దిశగా తీసుకున్న అడుగుగా భావిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరింత దెబ్బతింది.