LOADING...
Stock Market: స్టాక్ మార్కెట్‌కు 'యుద్ధ' నష్టాలే.. టారిఫ్‌ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతలు
స్టాక్ మార్కెట్‌కు 'యుద్ధ' నష్టాలే.. టారిఫ్‌ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతలు

Stock Market: స్టాక్ మార్కెట్‌కు 'యుద్ధ' నష్టాలే.. టారిఫ్‌ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నాయకుడు సహా పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం,దానికి అనుసంధానంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే నెమ్మదిగా ఉన్న మదుపర్ల విశ్వాసం మరింత దెబ్బతినొచ్చు. సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సూచీల్లో గణనీయమైన బరువు ఉన్న ఐటీ షేర్ల కదలికలు ప్రధాన పాత్ర పోషించే అవకాశముంది. ఆంత్రోపిక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ టూల్స్‌ వినియోగాన్ని ప్రభుత్వ సంస్థలు దశలవారీగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్టు సమాచారం. ఈ అంశంపై నెలకొన్న ఆందోళనలు తగ్గుముఖం పడితే, భారత ఐటీ కంపెనీల షేర్లు మళ్లీ కోలుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

నిఫ్టీ-50కి 25,350 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు 

అయితే సాంకేతిక సూచీల పరంగా ఇప్పటివరకు స్పష్టమైన ఉత్సాహ సంకేతాలు కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ధోరణి, విదేశీ మదుపర్ల ప్రవాహాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ముడి చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం, ఆర్థిక సమతుల్యతపై ఒత్తిడి పెరగడం ఖాయం. నిఫ్టీ-50కు 25,350 స్థాయిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా. హోలీ పండుగ కారణంగా మంగళవారం మార్కెట్లు మూసివుండనున్నాయి. ఫిబ్రవరిలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల్లో రూ.22,615 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 2014 సెప్టెంబరు (రూ.57,724 కోట్లు) తర్వాత ఇదే అత్యధిక ప్రవాహంగా నిలిచింది. వివిధ రంగాలపై విశ్లేషకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి:

వివరాలు 

బ్యాంకింగ్‌ రంగం:

నిఫ్టీ బ్యాంక్‌ సూచీ ఈ వారం 60,000 నుంచి 61,750 మధ్య ఊగిసలాడే అవకాశముంది. 60,000 దిగువకు జారితే మరింత బలహీనత కనిపించొచ్చు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు సంబంధించిన పరిణామాలు కూడా దృష్టిలో ఉంచాల్సిన అంశమే. లోహ రంగం: అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగుతున్నా, లోహ షేర్లు పడిన ప్రతిసారి కొనుగోలు చేసే విధానాన్ని కొంతమంది ట్రేడర్లు అనుసరించే వీలుంది. డిమాండ్‌ మెరుగుపడుతున్న నేపథ్యంలో ఉక్కు కంపెనీల పనితీరు మెరుగ్గా ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

వివరాలు 

యంత్రపరికరాల రంగం:

ఈ రంగ షేర్లు ఒక నిర్దిష్ట శ్రేణిలోనే కదలాడే అవకాశముంది. ప్రైవేటు సంస్థలు మూలధన వ్యయాలు పెంచితే ఈ కంపెనీలకు మేలు కలుగుతుంది. అయితే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. డేటా సెంటర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ కారణంగా కొన్ని కంపెనీలు లాభపడే అవకాశముంది. వాహన రంగం: ఆటో షేర్లలో సానుకూల ధోరణి కొంతవరకు కొనసాగొచ్చు. అయితే మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటంతో ఇక్కడ కూడా ఊగిసలాట తప్పకపోవచ్చు. ఫిబ్రవరి నెల టోకు విక్రయ గణాంకాల ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు 

సిమెంట్‌ రంగం:

ఈ రంగంలో కొంత ఒత్తిడి కొనసాగొచ్చు. రాబోయే నెలల్లో సిమెంట్‌ ధరల పెంపు పరిమితంగానే ఉండొచ్చని అంచనా. మార్చి త్రైమాసికంలో సీజనల్‌ డిమాండ్‌ కారణంగా పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రామ్‌కో కంపెనీల షేర్లు పడినప్పుడు కొనుగోలు చేయవచ్చని కొన్ని బ్రోకరేజీలు సూచిస్తున్నాయి. టెలికాం రంగం: టెలికాం షేర్లు స్వల్పకాలంలో ఒక పరిధిలోనే కదిలే సూచనలు ఉన్నాయి. టారిఫ్‌ పెంపు త్వరలో జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వొడాఫోన్‌ ఐడియా నిధుల సమీకరణ చర్యలు, జియో ప్లాట్‌ఫాం లిస్టింగ్‌కు సంబంధించిన వార్తలు ఈ రంగానికి కీలకంగా మారనున్నాయి.

వివరాలు 

చమురు-గ్యాస్‌ రంగం:

ఇరాన్‌ పరిణామాల ప్రభావంతో చమురు, గ్యాస్‌ షేర్లలో తీవ్ర ఊగిసలాట ఉండొచ్చు. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రతరమైతే ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 నుంచి 110 డాలర్ల మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా. అలా జరిగితే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్‌ కంపెనీలకు లాభం కలగొచ్చు. అయితే మార్కెటింగ్‌ కంపెనీలపై ఒత్తిడి పెరగవచ్చు. ఐటీ రంగం: ఐటీ షేర్ల దిశపై విశ్లేషకుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే భారీ అమ్మకాలు జరగడంతో కొంత మేరకు పుల్‌బ్యాక్‌ రావచ్చని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఏఐ పోటీ, విధానపరమైన అనిశ్చితి కారణంగా ఒత్తిడి కొనసాగొచ్చని మరికొందరు అంటున్నారు.

వివరాలు 

ఔషధ రంగం:

ఫార్మా షేర్లు ఒక నిర్దిష్ట శ్రేణిలోనే ట్రేడయ్యే అవకాశం ఉంది. జీఎల్‌పీ-1 ఆవిష్కరణల ప్రభావంతో పెద్ద ఔషధ కంపెనీలకు అనుకూలతలు కనిపించొచ్చు. అయితే జనరిక్‌ రెవ్లిమిడ్‌ విక్రయాలు తగ్గుముఖం పట్టడం ఈ రంగంపై జాగ్రత్త దృక్పథాన్ని కొనసాగించే అంశంగా మారింది. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగం: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల వృద్ధి రేటుపై సవాళ్లు ఎదురవుతాయన్న అంచనాల మధ్య, ఈ రంగ షేర్లు కూడా ఒక పరిమిత శ్రేణిలోనే కదలాడొచ్చు. జీఎస్‌టీ తగ్గింపు జరిగినప్పటికీ అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలకు స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Advertisement