గోఫస్ట్ విమాన సంస్థ సర్వీసులు బంద్.. టికెట్ బుకింగ్స్ రద్దు
ఆర్థికంగా నష్టాల్లో ఉన్న గోఫస్ట్ ఎయిరేవేస్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరికొన్ని సర్వీసులను రద్దు చేస్తూ ప్రకటన చేసింది. తొలుత మే 3, 4, 5 తేదీలో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ.. మళ్లీ 9వ తేదీ వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆపరేషనల్ కారణాల వల్ల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ సంస్థ తన వెబ్ సైట్‌లో వెల్లడించింది. ఆయా తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి సొమ్మును వాపస్ చేస్తామని సంస్థ ధ్రువీకరించింది. దాదాపుగా రూ.350 కోట్ల మేర సొమ్మును రిఫండ్ చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మే 15 వరకు టికెట్ల విక్రయాలు బంద్
అదే విధంగా మే 15 వరకు టికెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ డీజీసీఏకు వెల్లడించింది. ఈ క్రమంలో పూర్తి టికెట్ సొమ్మును రిఫండ్ చేయాలని డీజీసీఏ ఆదేశించింది. మరోవైపు గోఫస్ట్ సంస్థ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దాదాపు రూ.11,463 కోట్ల మేర అప్పుల్లో గోఫస్ట్ ఎయిర్ వేస్ కూరుకుపోయింది. చెల్లింపులపై మారటోరియం కోరడంతో పాటు డీజీసీఏ నుంచి ఎలాంటి చర్యలూ తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ వ్యవహారంపై ఎన్‌సీఎల్‌టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.