Gold Import Duty Explained: బంగారంపై భారీ షాక్.. దిగుమతి సుంకం 15%కు పెంపు.. ఇక గోల్డ్ మరింత భారమే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో బంగారం,వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని పిలుపునిచ్చిన కొన్ని రోజులకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై అమలులో ఉన్న 6 శాతం సుంకాన్ని ఒక్కసారిగా 15 శాతానికి పెంచింది. మే 13 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు 5 శాతం ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, 1 శాతం ఉన్న AIDC సెస్సును 5 శాతానికి పెంచారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
భారత్‌లో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి..
భారత్‌లో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఇందుకోసం భారీగా డాలర్లు ఖర్చవుతున్నాయి. 2025-26లో మాత్రమే దేశం సుమారు 71.98 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంది. దీంతో ఫారెక్స్ నిల్వలపై భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోళ్లు తగ్గించి డాలర్ల వినియోగాన్ని కంట్రోల్ చేయాలన్నదే కేంద్ర లక్ష్యంగా కనిపిస్తోంది. బంగారం దిగుమతులు 30-40 శాతం తగ్గితే ఏటా 20-25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా. దిగుమతి సుంకం పెరగడంతో బంగారం ధరలు వెంటనే ఎగబాకాయి.
వివరాలు
జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కలిస్తే నగల ధరలు మరింత భారమయ్యే అవకాశం
MCXలో బంగారం ధరలు 6 శాతం పైగా పెరిగి రూ.1.63 లక్షల మార్క్ దాటగా.. వెండి ధరలు రూ.2.96 లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు రూ.15,475 వద్ద ట్రేడవుతోంది. ఈ పెంపుతో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కలిస్తే నగల ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో బంగారం కొనుగోలు చేసే వారిపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారం కొనేవారు కొనుగోళ్లు వాయిదా వేసుకునే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు గోల్డ్ ETFలు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పాత బంగారం ఇచ్చి కొత్త నగలు తీసుకునే ట్రెండ్ కూడా పెరగొచ్చు.
వివరాలు
స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం
మరోవైపు ఈ నిర్ణయం వల్ల స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని బులియన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుమతి సుంకం పెరిగితే అక్రమ మార్గాల్లో బంగారం రవాణా లాభదాయకంగా మారుతుందని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు జ్యువెలరీ వ్యాపారులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా షాపులు మూసివేశారు. అయితే కొందరు వ్యాపార వర్గాలు మాత్రం దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నాయి.