
Gold Rates: అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో.. కుప్పకూలిన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, చైనా దేశాలు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వాణిజ్య పోరులో కీలక మలుపు తిరిగింది.
పరస్పరం పెంచుకుంటూ వచ్చిన ప్రతీకార సుంకాలను ఇరు దేశాలు ఇప్పుడు తగ్గించుకోవాలని అంగీకరించాయి.
టారిఫ్‌లపై వెనక్కి తగ్గుతూ, ఒకరికొకరు విధించిన పన్నులను ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నాయి.
వాణిజ్య విభేదాలను పరిష్కరించుకునే దిశగా రెండు దేశాలు ఓ కీలక ఒప్పందానికి వచ్చాయి.
ఈ ఒప్పందంలో భాగంగా, సుంకాలపై 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
దీంతో ఇరుదేశాలు దాదాపు 115 శాతం మేర సుంకాలను తగ్గించినట్లు ప్రకటించాయి.
ముఖ్యంగా, అమెరికా ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి చేసే వస్తువులపై విధించే సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది.
వివరాలు
బంగారం ధర కుప్పకూలడం - అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
ఈ ఒప్పంద ప్రభావం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌పై కూడా తీవ్రంగా కనిపించింది.
బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. హైదరాబాద్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1800 వరకు తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ గోల్డ్ & సిల్వర్ మార్కెట్ పరిస్థితి:
అమెరికా-చైనా చర్చలు ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఔన్సు గోల్డ్ ధర దాదాపు 90 డాలర్లు తగ్గింది.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3236 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 32.59 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు, రూపాయి విలువ డాలరుతో పోల్చితే మరింత తగ్గి గ్లోబల్ మార్కెట్లో రూ.84.985 వద్ద ఉంది.
వివరాలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పరిస్థితి:
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం రేటు ఒక్కసారిగా పతనమైంది.
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1800 మేర తగ్గి, తులం ధర ఇప్పుడు రూ.96,880కి చేరుకుంది.
అలాగే, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1650 తగ్గి, తులం ధర రూ.88,800కి పడిపోయింది.
వెండి ధరలో భారీ తగ్గుదల:
వెండి ధర కూడా బంగారాన్ని అనుసరించింది. గత ఐదు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర, ఈరోజు ఏకంగా రూ.2000 తగ్గడం గమనించాలి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,09,000 వద్ద ఉంది.