Gold price forecast: బంగారం ధరలు మళ్లీ ఆల్‌టైమ్ హైకి ఎప్పుడంటే.. గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మళ్లీ పాత రికార్డులను అందుకోవడానికి ఇప్పట్లో అవకాశం కనిపించడం లేదు. ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే గరిష్ఠ స్థాయుల నుంచి భారీగా దిగివచ్చిన పసిడి.. తిరిగి పుంజుకోవడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఔన్సుకు దాదాపు 5,600 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన బంగారం.. ఆ తర్వాత 30 శాతానికి పైగా పడిపోయింది. ఇటీవల 4,000 డాలర్ల దిగువకు కూడా చేరింది. ప్రస్తుతం ఈ ఏడాది మొత్తంగా దాదాపు 11 శాతం నష్టంతో కొనసాగుతోంది.
Details
వడ్డీ రేట్ల ప్రభావంతో బంగారంపై ఒత్తిడి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే దిశగా అడుగులు వేస్తుండటం బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతోంది.
ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉండటంతో డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.
దీనికి తోడు బలపడుతున్న అమెరికా డాలర్ కూడా పసిడికి ప్రతికూలంగా మారింది.
గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషకురాలు లీనా థామస్ నేతృత్వంలోని బృందం.. సమీప కాలంలో బంగారం ధరల్లో మరింత బలహీనత, హెచ్చుతగ్గులు ఉండొచ్చని పేర్కొంది.
Details
2027 చివరికి ఔన్సు ధర 4,650 డాలర్లు?
అయితే బంగారం ధరలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కాదు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం కొనసాగిస్తే.. ధరలకు కొంత మద్దతు లభించవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ భావిస్తోంది.
ఈ కారణంగా 2027 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 4,650 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పసిడికి దీర్ఘకాలికంగా బలాన్ని అందించే అంశంగా మారనున్నాయి.
Details
2028 చివరికి మళ్లీ రికార్డు ధర?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది.
అప్పుడు పాశ్చాత్య దేశాల్లో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లో పెట్టుబడులు మళ్లీ పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే బంగారం ధరలకు కొత్త ఊపు రావచ్చు.
2028 చివరి నాటికి ఔన్సు ధర 5,600 డాలర్లకు చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా.
ఆర్థిక అనిశ్చితి నుంచి రక్షణ కోసం పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మళ్లితే ధరలు మరింత పెరిగే వీలుంది.