Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం.. MCXలో తాజా ధరలు, కారణాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ స్వల్పంగా తగ్గడంతో శుక్రవారం (మార్చి 27) ఉదయం భారతీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. కొన్ని రోజులుగా పడిపోతున్న ధరలు, తక్కువ ధరల్లో కొనుగోళ్లు (వాల్యూ బయింగ్) పెరగడంతో ఒక్కసారిగా ఎగబాకాయి. ఎంసీఎక్స్‌లో ధరల పరిస్థితి MCXలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ దాదాపు 1% పెరిగి 10 గ్రాములకు రూ.1,43,829 వద్దకు చేరుకుంది. అదేవిధంగా వెండి కూడా జోరు చూపించింది. మే నెల వెండి కాంట్రాక్టులు సుమారు 2% పెరిగి కేజీకి రూ.2,23,978వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 0.10% తగ్గడం, ఇతర కరెన్సీల్లో బంగారం కొంత చౌకగా మారడం వల్ల పసిడికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
యుద్ధం, చమురు ప్రభావం
ఈ మార్చి నెల బంగారం మార్కెట్‌కు ఊగిసలాటగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. ఎంసీఎక్స్ గణాంకాల ప్రకారం, ఈ మార్చి నెలలో దేశీయ స్పాట్ గోల్డ్ ధరలు ఇప్పటివరకు దాదాపు 9% పడిపోయాయి.
వివరాలు
నిపుణుల అభిప్రాయాలు
ప్రస్తుత పరిస్థితిపై జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి మాట్లాడుతూ, "ధరలు కాస్త కోలుకున్నా, పాత రికార్డులను అధిగమించడం ప్రస్తుతం కష్టమే. భౌగోళిక రాజకీయ పరిస్థితులు బంగారానికి అనుకూలంగా ఉన్నా, డాలర్ బలంగా ఉండటం పెరుగుదలను అడ్డుకుంటోందన్నారు. అదేవిధంగా ఎల్కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతీన్ త్రివేది ఈ పెరుగుదలను తాత్కాలిక 'రిలీఫ్ ర్యాలీ'గా అభివర్ణించారు. "హార్ముజ్ జలసంధి పరిస్థితులపై స్పష్టత లేకపోవడం వల్ల మార్కెట్‌లో రిస్క్ ఇంకా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు రూ.1,35,000 నుంచి రూ.1,55,000 మధ్య ఊగిసలాడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.