LOADING...
Gold Purchase: బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉపాధిపై ప్రభావం: జువెలర్స్‌ సమాఖ్య
బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉపాధిపై ప్రభావం: జువెలర్స్‌ సమాఖ్య

Gold Purchase: బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉపాధిపై ప్రభావం: జువెలర్స్‌ సమాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వినియోగం లేకుండా నిల్వగా ఉన్న బంగారాన్ని సమీకరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆల్‌ ఇండియా జువెలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ (ఏఐజేజీఎఫ్‌) పేర్కొంది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలన్న సూచనలు దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మంది జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రజలను ఉద్దేశించి బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు తగ్గించే దిశగా కాకుండా,దేశీయంగా బంగారం సమీకరణ వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఏఐజేజీఎఫ్‌ ప్రభుత్వాన్ని కోరింది.

వివరాలు 

పీయూష్‌ గోయల్‌కు ఏఐజేజీఎఫ్‌ లేఖ

ఈ అంశంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పంకజ్‌ అరోరా లేఖ రాశారు. పెరుగుతున్న దిగుమతుల వ్యయం, విదేశీ మారక నిల్వలపై ప్రభుత్వ ఆందోళన సమంజసమేనని, అయితే దానికి పరిష్కారం బంగారం డిమాండ్‌ను తగ్గించడం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి చర్యల వల్ల ఆభరణాల తయారీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులలో అకస్మాత్తుగా ప్రతికూల భావన ఏర్పడితే ఆభరణాల దుకాణాలకు వచ్చే ఖాతాదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సమాఖ్య తెలిపింది. అదే సమయంలో తయారీ ఆర్డర్లు కూడా మందగించి, చిన్నతరహా వ్యాపారులు, చేతివృత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.

వివరాలు 

ప్రభుత్వానికి సమాఖ్య కీలక సూచనలు

ఇది కేవలం బంగారం వ్యాపారానికి సంబంధించిన అంశం మాత్రమే కాకుండా, కోట్లాది కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన సమస్య అని స్పష్టం చేసింది. బంగారం కొనుగోళ్లు తగ్గించడంపై దృష్టి పెట్టడం కంటే, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే నిర్మాణాత్మక మార్పులు చేపట్టాలని ఏఐజేజీఎఫ్‌ సూచించింది. దేశీయంగా బంగారం సమీకరణ కోసం ప్రత్యేక బులియన్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు తమ వద్ద ఉన్న భౌతిక బంగారం నిల్వల్లో 20 నుంచి 30 శాతం వరకు నియంత్రిత విధానంలో రుణాల రూపంలో ఇవ్వడానికి అనుమతించాలని కోరింది. 2015లో ప్రారంభించిన గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, అందులో ఉన్న లోపాలను సరిదిద్దుతూ పూర్తిస్థాయిలో మార్పులు చేయాలని సూచించింది.

Advertisement

వివరాలు 

ప్రభుత్వానికి సమాఖ్య కీలక సూచనలు

రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించే డీమ్యాట్‌ బులియన్‌ డిపాజిట్‌ ధ్రువపత్రాలను ప్రవేశపెట్టాలని తెలిపింది. దేశీయ బంగారం బదిలీలపై పన్నులు, వస్తు సేవల పన్ను తొలగించాలని కోరింది. బంగారం సమీకరణ, దిగుమతుల తగ్గింపు చర్యలపై పర్యవేక్షణ కోసం జాతీయ స్థాయి డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

Advertisement