LOADING...
Gold and silver ETF: దిగుమతి సుంకాల పెంపుతో దూసుకెళ్లిన బంగారం,వెండి ఈటీఎఫ్‌లు
దిగుమతి సుంకాల పెంపుతో దూసుకెళ్లిన బంగారం,వెండి ఈటీఎఫ్‌లు

Gold and silver ETF: దిగుమతి సుంకాల పెంపుతో దూసుకెళ్లిన బంగారం,వెండి ఈటీఎఫ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకాలను పెంచడంతో గోల్డ్‌,సిల్వర్‌ ఈటీఎఫ్‌ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీల్లో ఈ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లకు పెద్దఎత్తున కొనుగోళ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా క్వాంటమ్‌ గోల్డ్‌ ఫండ్‌ అత్యధికంగా దాదాపు 15శాతం ఎగిసి ఇంట్రాడేలో రూ.143.37ను తాకింది. టాటా గోల్డ్‌ ఈటీఎఫ్‌ సుమారు 12 శాతం,జిరోదా గోల్డ్‌ ఈటీఎఫ్‌ 9 శాతం మేర లాభపడ్డాయి. ఇదే సమయంలో సిల్వర్‌ ఈటీఎఫ్‌ల ధరలు కూడా 10 శాతం వరకు పెరిగాయి. అటు దేశీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు కూడా భారీగా ఎగిశాయి. ఎంసీఎక్స్‌లో జూన్‌ డెలివరీ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ధర 6 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,62,648కు చేరింది.

వివరాలు 

రూ.9 వేలకుపైగా పెరిగిన బంగారం 

జులై డెలివరీ సిల్వర్‌ ఫ్యూచర్స్‌ ధర కూడా 6 శాతం పెరిగి కిలో ధర రూ.2.95 లక్షలకు చేరుకుంది. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.65 లక్షలకు పెరిగింది. ఒక్కరోజులోనే దాదాపు రూ.9 వేలకుపైగా పెరగడం గమనార్హం. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగి కిలో రూ.2.95 లక్షలను దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,707 డాలర్లకు చేరగా, వెండి ధర 86 డాలర్లను దాటింది.

వివరాలు 

ఏంటీ ఈటీఎఫ్‌లు..

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు అంటే దేశీయ బంగారం ధరలకు అనుసంధానంగా ఉండే పెట్టుబడి విధానం. తక్కువ మొత్తంతో కూడా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం వీటి ద్వారా లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే భౌతిక బంగారం కొనకుండా, ఎలక్ట్రానిక్‌ రూపంలో బంగారాన్ని సొంతం చేసుకున్నట్లే. డీమ్యాట్‌ ఖాతా ఉన్నవారు యూనిట్ల రూపంలో వీటిని కొనుగోలు చేయవచ్చు. అవసరమైన సమయంలో సులభంగా విక్రయించుకోవచ్చు. బంగారంలో సురక్షితంగా, సులభంగా లావాదేవీలు నిర్వహించాలనుకునే వారికి ఈటీఎఫ్‌లు అనువైన మార్గంగా భావిస్తున్నారు.

Advertisement