Gold, silver imports: బంగారం, వెండిపై భారీ సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి దిగుమతులను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు విలువైన లోహాల దిగుమతులపై విధించే సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో బేసిక్ కస్టమ్స్ సుంకం 10శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు 5 శాతం విధించనున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో రూపాయి విలువ భారీగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.75కు చేరిన వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలకు దిగినట్లు ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
ముడి చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి
ఇటీవల ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఇప్పుడు సుంకాలను భారీగా పెంచడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలో బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా.. వెండి దిగుమతుల్లో తొలి స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో సుంకాల పెంపు ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి కొనుగోళ్లు మందగించే అవకాశం ఉందని భారత బులియన్, ఆభరణాల సంఘం కార్యదర్శి సురేంద్ర మెహత తెలిపారు. భారత్ అవసరమైన ముడి చమురులో దాదాపు 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇదే విధంగా బంగారం వినియోగంలో కూడా దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది.
వివరాలు
రూపాయి విలువ మరింత బలహీనపడే పరిస్థితి
దేశంలో ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల వరకు బంగారం వినియోగం జరుగుతుండగా.. దేశీయ ఉత్పత్తి మాత్రం చాలా పరిమితంగా ఉంది. దీంతో 90 శాతానికి పైగా బంగారం విదేశాల నుంచే తెప్పించుకోవాల్సి వస్తోంది. ముడి చమురు, బంగారం కొనుగోళ్లకు అమెరికా డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా దిగుమతులు పెరిగే కొద్దీ విదేశీ మారక నిల్వలు భారీగా ఖర్చవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగి.. రూపాయి విలువ మరింత బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోంది.