LOADING...
Gold vs Silver: US ఫెడ్ రేటు తగ్గింపు తర్వాత ఏ విలువైన లోహాన్ని కొనుగోలు చేయాలి? 
US ఫెడ్ రేటు తగ్గింపు తర్వాత ఏ విలువైన లోహాన్ని కొనుగోలు చేయాలి?

Gold vs Silver: US ఫెడ్ రేటు తగ్గింపు తర్వాత ఏ విలువైన లోహాన్ని కొనుగోలు చేయాలి? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు గురువారం భారీగా పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న తాజా ద్రవ్య విధాన నిర్ణయాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు రెండూ దిగజారాయి. ఎంసీఎక్స్‌ (MCX)లో బంగారం ఫ్యూచర్స్‌ రూ.1,20,666 గత ముగింపుతో పోలిస్తే 1.27 శాతం తక్కువగా రూ.1,19,125 వద్ద ప్రారంభమయ్యాయి. వెండి ఫ్యూచర్స్‌ కూడా 0.4 శాతం తగ్గి కిలోకు రూ.1,45,498 వద్ద ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటలకు బంగారం ధర రూ.1,827 తగ్గి 10 గ్రాములకు రూ.1,18,839కు చేరగా, వెండి రూ.1,411 తగ్గి కిలోకు రూ.1,44,670 వద్ద ట్రేడ్‌ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం అమెరికా డాలర్‌ విలువ స్వల్పంగా తగ్గడంతో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి.

వివరాలు 

అస్తవ్యస్తంగా కదులుతున్న వెండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య వాణిజ్య చర్చల పురోగతిపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో ఈ మార్పు కనిపించింది. "ఇటీవలి కాలంలో కరెన్సీ విలువ పెరగడం,భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం వంటి కారణాల వల్ల పరిశ్రమల,పెట్టుబడిదారుల డిమాండ్‌ తగ్గింది. దీనితో బంగారం,వెండి ధరల్లో సవరణలు చోటుచేసుకున్నాయి. అయితే బంగారం ఇంకా స్థిరంగా, భద్ర పెట్టుబడిగా కొనసాగుతుండగా, వెండి పరిశ్రమల ఆధారిత మిశ్రమ డిమాండ్‌ కారణంగా అస్తవ్యస్తంగా కదులుతోంది," అని ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌ అక్షా కాంబోజ్‌ తెలిపారు.

వివరాలు 

పడిపోయిన బంగారం,వెండి

ఇటీవలి సెషన్లలో బంగారం, వెండి రెండూ పడిపోయాయి. బంగారం ధర 12 ఏళ్లలోనే అత్యధిక పతనాన్ని చూసింది. మార్కెట్ నిపుణుల ప్రకారం, బంగారం ఎప్పటిలాగే సురక్షిత పెట్టుబడిగా నిలుస్తుంది. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం లేదా సెంట్రల్ బ్యాంకుల సడలింపు ద్రవ్య విధానాల సమయంలో ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు,పెట్టుబడిదారుల డిమాండ్ 2025లో ధరలకు మద్దతు ఇస్తోందని వారు పేర్కొన్నారు. వీటీ మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ,"బాండ్ యీల్డ్స్ పెరగడం,భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో తాత్కాలికంగా బంగారం ఆకర్షణ తగ్గింది.రికార్డు స్థాయిల నుంచి లాభాల స్వీకరణ కనిపిస్తోంది.అయితే మార్కెట్‌ అస్థిరతల సమయంలో సంపదను కాపాడగలగడం వల్ల దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది ఇంకా ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉంటుంది" అన్నారు.

వివరాలు 

పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం వెండి 

మరోవైపు వెండి పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే లోహం. సోలార్ ఎనర్జీ,ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో డిమాండ్‌పై దీని ధర ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్‌ బలపడితే వెండి బంగారాన్ని మించగలదని, కానీ ఆర్థిక మాంద్యంలో మాత్రం బంగారం పెట్టుబడిదారులకు సురక్షితమని మ్యాక్స్‌వెల్ వివరించారు.

వివరాలు 

స్థిరత్వం కోసం బంగారం.. వృద్ధి అవకాశాల కోసం వెండి 

"బంగారం,వెండి రెండూ పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఇస్తాయి. కానీ ఏది కొనాలన్నది కంటే మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా వాటి వాటాను నిర్ణయించడం ముఖ్యం. బంగారం భద్రత, స్థిరత్వానికి ప్రతీక. వెండి మాత్రం ఎక్కువ రిస్క్ ఉన్నప్పటికీ పరిశ్రమల డిమాండ్ పెరిగితే అధిక లాభాల అవకాశముంటుంది. ధరలు పడిపోతున్న సమయంలో దీర్ఘకాల పెట్టుబడిదారులు వెండిని డిప్స్‌లో కొనుగోలు చేయడం, బంగారాన్ని ఆర్థిక షాకులపై హెడ్జ్‌గా ఉంచడం ఉత్తమం" అని ఆయన చెప్పారు. మొత్తం చూస్తే,స్థిరత్వం కోసం బంగారం.. వృద్ధి అవకాశాల కోసం వెండి అని నిపుణులు సూచిస్తున్నారు.