Goldman Sachs: గోల్డ్‌మన్ సాక్స్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోతలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ వచ్చే నెల నుంచి ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. గతంలో వసంతకాలం, శరదృతువుల్లో ఒకేసారి పెద్ద స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే విధానం పాటించిన బ్యాంక్, ఈసారి దానికి భిన్నంగా ముందుకెళ్తోంది. ఒకేసారి భారీగా తొలగింపులు చేయకుండా, కొన్ని నెలల పాటు చిన్నచిన్న దశల్లో ఉద్యోగాల కోతలను అమలు చేయాలని నిర్ణయించింది.
వివరాలు
సాంప్రదాయ వార్షిక ఉద్యోగుల కోతల్లో మార్పు
గోల్డ్‌మన్ సాక్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో తక్కువ పనితీరు చూపిన 5 శాతం ఉద్యోగులను తొలగిస్తూ వేల సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించడం ఆనవాయితీగా కొనసాగిస్తోంది. అయితే ఈసారి సాధారణంగా నిర్వహించే వసంతకాల "స్ట్రాటజిక్ రిసోర్స్ అసెస్‌మెంట్ (SRA)" ప్రక్రియను బ్యాంక్ విరమించింది. దాని బదులుగా చిన్నచిన్న దశల్లో కోతలను అమలు చేయనుంది. మొదటి విడత ఉద్యోగాల కోతలు వచ్చే నెలలో ప్రారంభమై, వేసవి కాలం వరకు కొనసాగనున్నాయి.
వివరాలు
గోల్డ్‌మన్ సాక్స్‌లో కొత్త లేఆఫ్ వ్యూహం
ఈ కొత్త వ్యూహం ద్వారా విభాగాల అధిపతులకు ఉద్యోగాల కోతలపై మరింత నియంత్రణ లభిస్తుంది. దీంతో సంస్థవ్యాప్తంగా జరిగే సమీక్ష కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి ఆస్తి,సంపద నిర్వహణ విభాగాల వరకు అన్ని విభాగాల్లో ఈ కోతలు ప్రభావం చూపనున్నాయి. అయితే గత ఏడాది జరిగినట్లుగా భారీ స్థాయిలో కాకుండా, ఈసారి తక్కువ సంఖ్యలో ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉంది. గత సంవత్సరం సుమారు 2,300 ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి.
వివరాలు
ఉద్యోగాల కోతలపై గోల్డ్‌మన్ సాక్స్ స్పందన
ఉద్యోగాల కోతలపై వస్తున్న వార్తలకు స్పందించిన గోల్డ్‌మన్ సాక్స్ ప్రతినిధి, "ఒక పబ్లిక్ కంపెనీగా మేము నిరంతరం ఉద్యోగుల సంఖ్యను సమీక్షించడం సాధారణ ప్రక్రియే" అని తెలిపారు. బ్యాంక్‌లోని అన్ని విభాగాల్లో పనితీరు, ప్రతిభను నిరంతరం అంచనా వేస్తూనే ఉంటామని చెప్పారు. అయితే ఈసారి ఎంతమంది ఉద్యోగులను తొలగించాలన్న లక్ష్యంపై స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
'వన్ గోల్డ్‌మన్ సాక్స్' వ్యూహంతో సంబంధం లేదు
ఇప్పుడు చేపట్టబోయే ఉద్యోగాల కోతలు, ఇటీవల ప్రకటించిన "వన్ గోల్డ్‌మన్ సాక్స్" వ్యూహంతో సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యూహాన్ని అక్టోబర్‌లో ప్రకటించగా, సంస్థ వ్యాపారాలను సమగ్రంగా అనుసంధానం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాజా ఫలితాల్లో గోల్డ్‌మన్ సాక్స్ 58 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసి, గత సంవత్సరంతో పోలిస్తే 9 శాతం వృద్ధిని సాధించింది.