బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారానికి ఐదు రోజులే డ్యూటీ..?
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే శుభవార్తను చెప్పనుంది. ఇకపై వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలను చేస్తోంది. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులు ఎంతోకాలంగా ఐదు రోజుల పనిదినాల కోసం వేచి చూస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పించేందుకు గతంలో ఏబీఏ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపిన విషయం తెలిసిందే. దీనిపై త్వరలో అమోదం తెలపనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వేజ్ బోర్డు సవరణలు చేసి కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కొన్ని మీడియా ఛానల్స్ తెలిపాయి.
బ్యాంకు ఉద్యోగుల పనివేళల్లో మార్పు!
కరోనా నేపథ్యంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని గతంలో బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేశాయి. అయితే ఇండియన్స్ బ్యాంక్స్ అసోసియేషన్ దీన్ని ఒప్పుకోలేదు. ఇంకా వేతనంలో 19శాతం పెంచుతామని ఆఫర్ కూడా చేసింది. కానీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ విషయాన్ని తప్పుపట్టింది. ఈ ఏడాది మరోసారి బ్యాంకు యూనియన్లతో ఏబీఏ చర్చలు చేసింది. దీంతో ఐదు రోజుల పనివిధానాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఏబీపీ తెలిపింది. అయితే రోజువారీ పని గంటలతో పాటు మరో 40 నిమిషాలను పెంచుతామని స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు ఉద్యోగులు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయాల్సి ఉండనుంది.