RBI Rate Cut: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త.. 5 ఏళ్ల విరామం తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు?
ఈ వార్తాకథనం ఏంటి
గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్ల తగ్గింపును కొనసాగించింది.
గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో సడలింపులు ఇస్తుండటంతో, భారతీయులు సైతం ఇదే తరహా నిర్ణయాన్ని కోరుకుంటున్నారు.
ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో భారతీయ మధ్యతరగతి ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ నుంచి మరో శుభవార్త రానుందని సమాచారం.
రేపటి నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనున్న మానిటరీ పాలసీ సమావేశంలో, దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Details
వడ్డీ రేట్ల తగ్గింపుపై మరింత ఆసక్తి
రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.
జీడీపీ వృద్ధి మందగమనం మధ్య, శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో, వడ్డీ రేట్ల తగ్గింపుపై మరింత ఆసక్తి నెలకొంది.
నిపుణుల అంచనా ప్రకారం, ఈసారి మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశం ఉంది.
ఇదే జరిగితే, ప్రస్తుత 6.5% రెపో రేటు 6.25%కు తగ్గుతుందని భావిస్తున్నారు.
భారతదేశంలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ రిజర్వు బ్యాంక్ లక్ష్యమైన 4% కంటే ఎక్కువగా కొనసాగుతోంది. ఇది పెద్ద సవాలుగా మారింది.
Details
వడ్డీ రేట్ల తగ్గింపునకు మద్దతు
ఆర్థిక వృద్ధి మందగమనం, ప్రభుత్వ ముందస్తు అంచనాల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజల వద్ద లిక్విడిటీ పెంచే చర్యలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ చర్యలు వడ్డీ రేట్ల తగ్గింపునకు మద్దతు కల్పిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే క్రమంలో గతవారం రిజర్వు బ్యాంక్ దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో అదనంగా రూ.1.5 లక్షల కోట్లు ఇన్ఫ్యూజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్‌లో రూ.1.16 లక్షల కోట్ల నిధులు అందించిన తర్వాత ఇది గమనార్హమైన పరిణామంగా మారింది. క్యాష్ రిజర్వ్ రేషియోలో కూడా మార్పులు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
Details
ద్రవ్యోల్బణం 4.5శాతానికి చేరే అవకాశం
ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్ల కోత చాలా ముఖ్యమైన చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరిలో భారతదేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు జరిగే అవకాశం ఉందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ గౌరా సేన్‌గుప్తా తెలిపారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణ నియంత్రణ సాధ్యమవుతున్నట్లు కనిపిస్తోందని, కూరగాయల ధరలు తగ్గడం వల్ల జనవరిలో సీపీఐ ద్రవ్యోల్బణం 4.5%కు చేరే అవకాశం ఉందని వివరించారు.