
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఒకేసారి మొత్తం విత్‌డ్రా చేసుకునే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను మరింత ప్రజల వద్దకు చేరవేసేందుకు, పీఎఫ్ ఖాతాలపై అమలులో ఉన్న నిబంధనలను సరళతరం చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సభ్యులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు ఉపసంహరించుకునే విధానంలో కీలక మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం ఈపీఎఫ్ఓ ప్రతి పదేళ్లకోసారి ఖాతాదారులు తమ ఖాతాలోని మొత్తాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించే ప్రతిపాదనను తీసుకొచ్చిందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు మోదీ ప్రభుత్వ నుంచి ఆమోదం లభిస్తే, రూ.7 కోట్ల మందికిపైగా ఉన్న ప్రైవేట్ రంగానికి చెందిన క్రియాశీల పీఎఫ్ ఖాతాదారులకు ఇది పెద్ద ఊరటగా మారుతుంది.
Details
ఈ కొత్త మార్పుతో ఉపశమనం
ఇప్పటి వరకు పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది లేదా ఉద్యోగం వదిలిన తరువాత కనీసం రెండు నెలలు నిరుద్యోగంగా ఉండాలి. కానీ 35-40ఏళ్ల వయసులో కెరీర్ మార్చుకునే లేదా పరిస్థితుల వల్ల రెగ్యులర్ ఉద్యోగం చేయలేని వారు కూడా ఉండటంతో, వారికోసం ఈ కొత్త మార్పు ఉపశమనం కలిగించనుంది. ఈ మార్పుల ద్వారా, వారు 58 ఏళ్లు దాటకుండానే తమ పీఎఫ్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక విత్‌డ్రా ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు,యూపీఐ లేదా ఏటీఎం ద్వారా పీఎఫ్ ఖాతా నుంచి తక్షణమే రూ.1 లక్ష వరకు డబ్బు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈసదుపాయం ఎంతో ఉపయోగపడనుంది.
Details
రూ.5లక్షల వరకు పరిమితి
గతంలో రూ.1 లక్ష వరకే ఆటో క్లెయిమ్ పరిష్కార వ్యవస్థ ఉండగా, ఇప్పుడు ఈ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచారు. ఈ క్లెయిమ్‌లకు ఎలాంటి మానవీయ ధృవీకరణ అవసరం ఉండదు. క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగా, అవసరమైన పత్రాల సంఖ్యను 27 నుంచి 18కి తగ్గించారు. దీనివల్ల ఇప్పుడు క్లెయిమ్ ప్రాసెస్ 3-4 రోజుల్లో పూర్తవుతుంది. కేవలం 3 సంవత్సరాల సర్వీస్ చేసిన వారు ఇంటి డౌన్ పేమెంట్ లేదా ఈఎంఐ కోసం తమ పీఎఫ్ ఖాతాలోని 90 శాతం వరకు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రతిపాదనలన్నీ అమలులోకి వస్తే, ఉద్యోగుల భద్రతతో పాటు, వారి ఆర్థిక సౌలభ్యాన్ని పెంపొందించడంలో EPFO మరో అడుగు ముందుకు వేసినట్లే.