CBRT: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆడిట్ నివేదిక సమర్పణకు గడువు పెంపు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఇటీవల 2023-24 సంవత్సరానికి ఆదాయపు పన్ను ఆడిట్ నివేదికలను సమర్పించడానికి గడువును పొడిగించింది. ఈ కొత్త గడువు అక్టోబర్ 7, 2024గా నిర్ణయించారు. సాంకేతిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులకు నివేదికలు సమర్పించడంలో ఇబ్బందులు ఏర్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపయోగకరంగా మారనుంది. పన్ను ఆడిట్ నివేదికను సమయానికి సమర్పించని పక్షంలో జరిమానా రూ. 1.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
అక్టోబర్ 7 వరకు గడువు పొడగింపు
ఈ గడువు పొడిగింపుతో, పన్ను చెల్లింపుదారులు జరిమానా మినహాయింపును కూడా పొందే అవకాశం ఉంది. ఆడిట్ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులందరికీ ఈ పొడిగింపు వర్తిస్తుంది. సెప్టెంబర్ 30, 2024లోపు నివేదికలను సమర్పించాల్సిన వారు ఇప్పుడు అక్టోబర్ 7, 2024లోపు నివేదికలను అప్‌లోడ్ చేయవచ్చు. వివిధ పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నందున, నివేదికలను సమర్పించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని CBDT స్పష్టం చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ గడువు పొడిగించారు.