Budget 2026: మధ్యతరగతికి శుభవార్త.. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు రూ.5 లక్షలకు!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో పాత పన్ను విధానం (Old Tax Regime)ను ఎంచుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సొంత ఇల్లు కొనాలనే ఆశతో ఉన్నవారికి హోమ్ లోన్ వడ్డీ రాయితీ విషయంలో పెద్ద ఊరట లభించే అవకాశముందని అంచనాలు వినిపిస్తున్నాయి. హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపును గణనీయంగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ 2026లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి లాభాలు దక్కనున్నాయో చూద్దాం.
Details
హోమ్ లోన్ వడ్డీ రాయితీ రూ.5 లక్షలకు?
ప్రస్తుతం పాత పన్ను విధానంలో హోమ్ లోన్ తీసుకున్న వారు చెల్లించే వడ్డీపై సెక్షన్ 24(బి) కింద ఏడాదికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ ధరలు, ఇంటి నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది అమలైతే లక్షలాది మంది వేతన జీవులకు పన్ను రూపంలో గణనీయమైన ఆదా కలగనుంది.
Details
పాత పన్ను విధానానికి మళ్లీ ఊపిరి
గత రెండు బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానం (New Tax Regime)ను ప్రోత్సహించింది. అయినప్పటికీ, దేశంలోని ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు ఎల్‌ఐసీ (LIC), పీపీఎఫ్ (PPF), హోమ్ లోన్ వంటి పెట్టుబడుల ద్వారా పన్ను ఆదా చేసుకునే పాత విధానాన్నే ప్రాధాన్యంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత పన్ను విధానంలో మరిన్ని రాయితీలు కల్పించడం ద్వారా మధ్యతరగతి ప్రజల ఖర్చు సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Details
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
హోమ్ లోన్ వడ్డీ రాయితీ పెంపు పన్ను చెల్లింపుదారులకే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పెద్ద దన్నుగా మారనుంది. వడ్డీపై మినహాయింపులు పెరిగితే మరింత మంది ఇల్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. దాంతో పాటు సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ రంగాల్లోనూ డిమాండ్ పెరిగే అవకాశముంది.
Details
ఇతర అంచనాలు
సెక్షన్ 80C కింద ఉన్న రూ.1.5 లక్షల పెట్టుబడి పరిమితిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల కోసం ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) ప్రస్తుతం ఉన్న రూ.50,000 నుంచి మరింత పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు బడ్జెట్‌లో అమలైతే, మధ్యతరగతి ప్రజలకు నిజంగా పండుగ వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇది గొప్ప ప్రోత్సాహంగా నిలవనుంది.