LOADING...
Customs Duty: యుద్ధ వేళ కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోకెమికల్స్ దిగుమతులపై సడలింపు
యుద్ధ వేళ కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోకెమికల్స్ దిగుమతులపై సడలింపు

Customs Duty: యుద్ధ వేళ కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోకెమికల్స్ దిగుమతులపై సడలింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం,తాజాగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతులపై మరిన్ని సడలింపులు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొన్ని ముఖ్యమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మినహాయించారు. ఈ మినహాయింపు నేటి (ఏప్రిల్ 2) నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది.

వివరాలు 

ధరల పెరుగుదల నుంచి కొంతవరకు ఉపశమనం

దేశీయ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకుల సరఫరాలో అంతరాయం లేకుండా చూడటం, వాటిపై ఆధారపడిన రంగాలపై వ్యయభారం తగ్గించడం, దేశంలో సరఫరా స్థిరత్వాన్ని కొనసాగించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఈ సుంక మినహాయింపు తాత్కాలికమే అయినప్పటికీ, తుది ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులకు ధరల పెరుగుదల నుంచి కొంతవరకు ఉపశమనం లభించే అవకాశముంది. ఈ నిర్ణయం కింద మిథనాల్, అన్‌హైడ్రస్ అమోనియా, డైక్లోరోమిథేన్, వినైల్ క్లోరైడ్ మోనోమర్, స్టిరేన్, పాలీబ్యుటడిన్, స్టైరిన్ బ్యూటడిన్, అన్‌సాచురేటెడ్ పాలిస్టర్ రెసిన్స్ వంటి పెట్రోకెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం మాఫీ చేశారు.

వివరాలు 

దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు సరఫరా సమస్యలు

ఈ సడలింపులతో ప్లాస్టిక్, టెక్స్‌టైల్, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, కెమికల్ రంగాలకు గణనీయమైన ఊరట లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా హర్మూజ్ మార్గం ద్వారా సరుకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంగా ముడి చమురు, సహజ వాయువు, ఎరువులు, ఇతర రసాయనాల దిగుమతులపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రధాన దిగుమతిదారుగా ఉండటంతో, అంతర్జాతీయ పరిణామాలపై కేంద్రం సున్నితంగా స్పందిస్తూ ఈ చర్యలు చేపట్టింది.

Advertisement