LOADING...
Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ
380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ

Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్‌మార్కింగ్ నిబంధనలు విస్తరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాల స్వచ్ఛత విషయంలో పారదర్శకత పెంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పసిడి ఆభరణాలకు తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ నిబంధనలను మరింత విస్తరించి దేశంలోని 380 జిల్లాలకు వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ నిబంధనలను ప్రభుత్వం 2021లో దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి దశలో మరిన్ని ప్రాంతాలకు ఈ విధానాన్ని విస్తరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ నిబంధనలను 380 జిల్లాలకు విస్తరించడం వల్ల చిన్న పట్టణాలు,ప్రాంతీయ మార్కెట్లు కూడా తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 800జిల్లాలు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే ఇప్పటికీ సుమారు 400 జిల్లాల్లో ఈ నిబంధనలు అమల్లోకి రాలేదు.

వివరాలు 

మోసాలకు అడ్డుకట్ట...:

హాల్‌మార్కింగ్‌ ఆఫ్‌ గోల్డ్‌ జువెలరీ అండ్‌ గోల్డ్‌ ఆర్టిఫ్యాక్ట్స్‌ (సవరణ) ఆదేశాలు-2026' ప్రకారం, హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి నిబంధనలను 380 జిల్లాలకు విస్తరించుతూ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పసిడి వినియోగం ఎక్కువగా ఉండే తెలంగాణలో 13 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 18 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర‌, తమిళనాడు‌, కర్ణాటక‌, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని రెండో, మూడో స్థాయి జిల్లాలను కూడా హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి పరిధిలో చేర్చారు. పెద్ద నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాలు, ప్రాంతీయ మార్కెట్లలో బంగారం స్వచ్ఛతపై వినియోగదారులకు అవగాహన తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

బంగారం స్వచ్ఛతను సులభంగా తెలుసుకునే అవకాశం

అక్కడ కూడా హాల్‌మార్కింగ్‌ నిబంధనలను అమలు చేయడం వల్ల కొనుగోలుదారులు చెల్లించిన డబ్బుకు తగినంత స్వచ్ఛమైన బంగారాన్ని పొందగలరని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రతి బంగారు ఆభరణంపై ఉండే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ద్వారా వినియోగదారులు ఆ బంగారం స్వచ్ఛతను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మోసాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement