
Vivad Se Vishwas 2.0: అక్టోబర్ 1 నుంచి వివాద్ సే విశ్వాస్ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వివాదాలను పరిష్కరించేందుకు తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం (Vivad Se Vishwas 2.0) అమలుకు సంబంధించిన తేదీని ప్రకటించింది.
ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుందని శుక్రవారం వెల్లడించింది.
2024-25 బడ్జెట్‌లో జులైలో ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వివిధ న్యాయ వేదికల్లో రూ.35 లక్షల కోట్ల విలువైన 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనబడింది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు, పన్ను విధానాలను సులభతరం చేసి, పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించారు.
వివరాలు
ప్రభుత్వ ఖజానాకు రూ.75 వేల కోట్ల ఆదాయం
ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, ఫారాలు వచ్చే వారం అందుబాటులోకి వస్తాయని డెలాయిట్ ఇండియా భాగస్వామి కరిష్మా ఆర్ ఫాటర్మేకర్ తెలిపారు.
2020లో కూడా ఈ పథకం ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారం కోసం కేంద్రం తీసుకొచ్చింది.
వివాద్ సే విశ్వాస్ పేరిట ప్రారంభమైన ఆ పథకాన్ని లక్ష మందికి పైగా పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకున్నారు.
దాంతో ప్రభుత్వ ఖజానాకు రూ.75 వేల కోట్ల ఆదాయం లభించింది. ఈ విజయంతో, కేంద్రం 2.0 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.
2024 జులై 22 నాటికి సుప్రీం కోర్టు, హైకోర్టు, ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్స్, కమిషనర్లు/జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న వివాదాలను ఈ పథకం కింద పరిష్కరించుకోవచ్చని పేర్కొనబడింది.