Gas Subsidy Cut: గ్యాస్ సబ్సిడీపై కేంద్రం షాక్.. ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సిలిండర్లకే రాయితీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన రంగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కీలక నిర్ణయం ప్రకటించింది. ఉజ్వల పథకం కింద సబ్సిడీతో అందించే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను భారీగా తగ్గించింది. ఇప్పటివరకు ఏడాదికి 9 సిలిండర్ల వరకు సబ్సిడీ అందుతుండగా, ఇకపై కేవలం 4 సిలిండర్లకే ఈ ప్రయోజనం వర్తించనుంది. ఉజ్వల పథకం ప్రారంభ దశలో ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందించగా,తర్వాత దాన్ని 9కు కుదించారు. తాజాగా మరోసారి తగ్గిస్తూ నాలుగు సిలిండర్లకే పరిమితం చేయడం గమనార్హం.
వివరాలు
రూ.700 వరకు భారం
ఈ నిర్ణయంపై పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మల్ స్పందిస్తూ.. ప్రస్తుతం నెలకొన్న పశ్చిమాసియా పరిస్థితులు, దేశీయ కుటుంబాల సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేసినట్లు తెలిపారు. గతంలో ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ అందించగా, అనంతరం కేంద్ర ప్రభుత్వం దాన్ని రూ.300కు పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఇతర అనేక దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎల్‌పీజీ ధరలు తక్కువగానే ఉన్నాయని, ఒక్కో సిలిండర్‌పై చమురు మార్కెటింగ్ సంస్థలు సుమారు రూ.700 వరకు భారం భరిస్తున్నాయని వెల్లడించారు.
వివరాలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు, సహజవాయువు సరఫరాపై ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీయంగా కూడా ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగింది. ఇటీవల చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా సవరించాయి. మొదట కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగగా, తర్వాత గృహ వినియోగ ఎల్‌పీజీ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.994కు చేరుకోగా, యుద్ధానికి ముందు ఇదే ధర రూ.905గా ఉండేది.
వివరాలు
ఉజ్వల యోజనలో ప్రస్తుతం లభించే ప్రయోజనాలు..
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు మొదటి గ్యాస్ రీఫిల్, స్టవ్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. తాజా మార్పులతో ఇకపై ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లకు మాత్రమే ఒక్కో సిలిండర్‌పై రూ.300 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. అంటే ఏడాదికి గరిష్ఠంగా రూ.1,200 వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది.