Tax Rules for Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఊరట.. కేంద్రం కీలక ఆర్డినెన్స్‌కు ఆమోదం!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను నిబంధనలను సడలించే ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇటీవలి కాలంలో రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే సుమారు 6 శాతం పడిపోవడం, అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) ఈ ఏడాది జనవరి నుంచి భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది.
వివరాలు
ద్రవ్య విధాన కమిటీ సమావేశనాంతరం ర్‌బీఐ కీలక ప్రకటనలు చేసే అవకాశం
ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకోబోయే ఇతర ఆర్థిక చర్యలతో కలిసి అమలులోకి వచ్చే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం శుక్రవారం ఆర్‌బీఐ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను పరిశీలిస్తోంది. వ్యాపారాలకు ప్రభుత్వ హామీతో రుణ సదుపాయాలు, ఎగుమతిదారులకు ప్రత్యేక ప్యాకేజీలు, ఇంధనం సహా కొన్ని సుంకాల్లో మార్పులు వంటి చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదన
ఇదిలా ఉండగా,భారత ప్రభుత్వ బాండ్లు (G-Secs)లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు (FIIs) అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిపై 20 శాతం విత్‌హోల్డింగ్ ట్యాక్స్‌తో పాటు 12.5 శాతం క్యాపిటల్ గెయిన్స్ పన్ను అమల్లో ఉంది. గతంలో ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, రూపాయి ఆధారిత బాండ్లపై 5 శాతం పన్ను మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది 20 శాతానికి పెరిగింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరట
దీంతో భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం విదేశీ ఇన్వెస్టర్లకు అంతగా ఆకర్షణీయంగా లేకుండా పోయిందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే రూపాయి పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.