Loading...
Centre: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త రూల్.. 30 రోజుల నుంచి 15 రోజులకు కుదింపు 
చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త రూల్.. 30 రోజుల నుంచి 15 రోజులకు కుదింపు

Centre: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త రూల్.. 30 రోజుల నుంచి 15 రోజులకు కుదింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వరుస పండగలు సమీపిస్తున్న వేళ దేశంలో పంచదార ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా నిల్వలు లేకపోవడం, మరోవైపు పండగల సమయంలో చక్కెరకు డిమాండ్ భారీగా పెరగనుండటంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలతో పాటు చక్కెరను పెద్ద మొత్తంలో వినియోగించే వ్యాపారులు, పరిశ్రమల్లోనూ ఆందోళన పెంచుతోంది. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. నిల్వలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

వివరాలు 

సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి..

ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

నెలకు 10 మెట్రిక్ టన్నులకు మించి పంచదారను వినియోగించే లేదా విక్రయించే పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు ఇకపై తమ వద్ద 15 రోజులకు సరిపడే నిల్వను మాత్రమే ఉంచుకోవాలి.

గతంలో ఈ పరిమితి 30 రోజులుగా ఉండేది. అయితే ధరల్లో ఆశించిన స్థాయిలో తగ్గుదల కనిపించకపోవడంతో కేంద్రం నిల్వ పరిమితిని సగానికి తగ్గించింది.

ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. నవంబర్ 30 వరకు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు 

రికార్డు స్థాయిలో ధరలు

ఇటీవల బహిరంగ మార్కెట్లో పంచదార ధరలు దాదాపు 10 శాతం వరకు పెరిగాయి.

ఏడాది క్రితం ఒక క్వింటాల్ పంచదార మిల్లు ధర సుమారు రూ.3,900గా ఉండగా.. ప్రస్తుతం రూ.5,400 నుంచి రూ.5,500 వరకు చేరింది.

దీంతో చక్కెర ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మిల్లుల వద్ద ధరలు పెరగడంతో ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌పైనా పడింది.

స్థానిక కిరాణా దుకాణాల్లో కిలో పంచదార ధర 13 శాతానికి పైగా పెరిగి రూ.52 దాటింది.

పండగల సమయంలో స్వీట్లు, పిండివంటలు చేసుకునే కుటుంబాలపై ఇది అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

వర్షాభావంతో తగ్గిన చెరకు దిగుబడి

ఈ ఏడాది చెరకు సాగు చేసే ప్రధాన ప్రాంతాల్లో తగినంత వర్షపాతం నమోదుకాకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి.

ఫలితంగా చెరకు ఉత్పత్తి తగ్గడంతో రానున్న సీజన్‌లో పంచదార లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త చక్కెర సీజన్‌కు అవసరమైన నిల్వలు దేశీయ డిమాండ్‌తో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశంలో సాధారణంగా సుమారు 50 లక్షల టన్నుల పంచదార నిల్వలు అవసరమవుతాయని అంచనా.

అయితే కొత్త సీజన్ ప్రారంభానికి ప్రస్తుతం అందుబాటులో ఉండే ఆరంభ నిల్వలు సుమారు 32 లక్షల నుంచి 42 లక్షల టన్నుల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

వర్షాభావంతో తగ్గిన చెరకు దిగుబడి

ఇదే సమయంలో స్వీట్లు, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీదారుల నుంచి చక్కెరకు భారీగా డిమాండ్ వస్తోంది.

ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో నిల్వలు చేసి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించకుండా అడ్డుకోవడమే కేంద్రం తాజా నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

పంచదార అక్రమ నిల్వలను నియంత్రించి, పండగల సీజన్‌లో వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ADVERTISEMENT