EPF Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 8.25% వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఈ నెలలోనే జమ!
ఈ వార్తాకథనం ఏంటి
ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీ జమ ప్రక్రియకు మార్గం సుగమమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సిఫార్సు చేసిన 8.25 శాతం వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలాఖరులోగా చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
మూడో ఏడాది కూడా 8.25 శాతం వడ్డీ
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాలపై 8.25 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది మార్చి 2న సిఫార్సు చేసింది. ఆ ప్రతిపాదననుకేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదించింది.దీంతో వరుసగా మూడో ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగనుంది. వడ్డీ జమ ఎప్పుడంటే? సాధారణంగా సీబీటీ సిఫార్సు చేసిన వడ్డీ రేటును కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన తర్వాతే ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. గత ఏడాది మే 24న ఆమోదం లభించగా,ఈసారి దాదాపు నెలరోజుల ఆలస్యంగా అనుమతి వచ్చింది. అయినప్పటికీ ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
ఆలస్యంగా జమైతే చక్రవడ్డీ నష్టమా?
ఇటీవల ఈపీఎఫ్‌వో కొత్త డిజిటల్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసిన నేపథ్యంలో, గతంతో పోలిస్తే వడ్డీ జమ ప్రక్రియ మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ వడ్డీ జమ కాకపోవడంతో కొందరు చందాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వడ్డీ ఆలస్యంగా జమ కావడం వల్ల చక్రవడ్డీ ప్రయోజనం కోల్పోతామా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ అంశంపై ఈపీఎఫ్‌వో స్పష్టత ఇచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ప్రతి నెల నిల్వల ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. నెలనెలా గణించిన వడ్డీ మొత్తాన్ని మాత్రం ఏడాది చివర్లో ఒకేసారి ఖాతాల్లో జమ చేస్తారు.
వివరాలు
గత కొన్నేళ్ల ఈపీఎఫ్ వడ్డీ రేట్లు
కాబట్టి వడ్డీ జమలో ఆలస్యం జరిగినా చందాదారులకు ఎలాంటి నష్టం ఉండదని ఈపీఎఫ్‌వో తెలిపింది. అయితే, ఏడాది మధ్యలో డబ్బులు విత్‌డ్రా చేస్తే ఆ మేరకు వడ్డీ తగ్గుతుంది. అలాగే, క్రియాశీలంగా లేని లేదా నిలిచిపోయిన ఖాతాలకు ఈపీఎఫ్‌వో వడ్డీ చెల్లించదు. ఈపీఎఫ్ వడ్డీ రేట్లలో గత కొన్నేళ్లుగా మార్పులు చోటుచేసుకున్నాయి. 2015-16 :8.80 శాతం 2018-19 :8.65 శాతం 2019-20 :8.50 శాతం 2020-21 :8.10 శాతం (ఇటీవలి కాలంలో అత్యల్పం) 2022-23 : 8.15 శాతం 2023-24 : 8.25 శాతం 2024-25 : 8.25 శాతం 2025-26 : 8.25 శాతం ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీని కొనసాగిస్తూ వస్తున్నారు.
వివరాలు
చందాదారులకు ఊరట
కేంద్రం ఆమోదంతో ఈపీఎఫ్ ఖాతాదారుల నిరీక్షణకు తెరపడింది. కొత్త సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఈ నెలలోనే వడ్డీ జమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వడ్డీ జమలో ఆలస్యం జరిగినా చక్రవడ్డీ ప్రయోజనంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేయడంతో లక్షలాది మంది ఉద్యోగులు ఊరట చెందుతున్నారు.