
GST 2.0: రైల్ నీర్ వాటర్ బాటిల్ ధరలను తగ్గించిన ఇండియన్ రైల్వేస్
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త.ఇటీవల జీఎస్టీ తగ్గింపు తర్వాత,భారతీయ రైల్వే(Indian Railways) తన ప్రసిద్ధ బాటిల్ వాటర్ బ్రాండ్ రైల్ నీర్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రైల్వే స్టేషన్లలో,రైళ్లలో విక్రయించే ఇతర ప్యాక్ చేసిన నీటి ధరలకు కూడా వర్తిస్తుంది. సెప్టెంబర్ 20, 2025న జారీ చేసిన అధికారిక నోటీసులో,రైల్వే బోర్డు అన్ని జనరల్ మేనేజర్లు, ఐఆర్‌సిటిసి (IRCTC)చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌లకు గరిష్ట రిటైల్ ధర (MRP)ఒక లీటరు ₹15 నుండి ₹14కి, 500 మిల్లీ లీటర్ బాటిల్ ₹10 నుండి ₹9కి తగ్గించమని స్పష్టం చేసింది. ఈ ధరల సర్దుబాటు రైల్ నీర్‌తో పాటు,రైల్వే ఆమోదిత ఇతర ఐఆర్‌సిటిసి బాటిల్ వాటర్ బ్రాండ్లకు కూడా వర్తిస్తుంది.
వివరాలు
రైల్ నీర్ - ఐఆర్‌సిటిసి ప్రధాన ఉత్పత్తి
నోటీసులో పేర్కొన్నట్లుగా, "ఈ నిర్ణయం జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా ప్రయాణికులకు అందిస్తుంది." కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమలులోకి వస్తాయి. రైల్వే అధికారులు చెప్పినట్లుగా, ఇది పన్ను తగ్గింపును నేరుగా వినియోగదారులకు అందించే భారతీయ రైల్వే నిబద్ధతను సూచిస్తుంది. 2003లో ప్రారంభమైన రైల్ నీర్, ఐఆర్‌సిటిసి యొక్క ప్రధాన ఉత్పత్తిగా ఉంది. ఇది రైలు ప్రయాణికులకు సురక్షిత, పరిశుభ్రమైన తాగునీటిని అందించడానికి తీసుకొచ్చారు. మొదటి ఉత్పత్తి ప్లాంట్ న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల నుంచి ప్రయాణించే రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సరఫరా చేయడానికి పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయిలో ఏర్పాటు చేయబడింది. ఎన్నో ఏళ్లుగా రైల్ నీర్ నమ్మకమైన, పరిశుభ్రమైన తాగునీటికి ప్రతీకగా మారింది.
వివరాలు
ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రయోజనం
ఇప్పుడు, రైల్వే బోర్డు తాజా నిర్ణయం ద్వారా దీని ధరలను తగ్గించింది. వాణిజ్య సర్క్యులర్ నం. 18, 2025 ద్వారా కొత్త ధరల అమలు నిర్ణయించబడింది. అన్ని రైల్వే శాఖలు మరియు ఐఆర్‌సిటిసి అవుట్‌లెట్‌లు వెంటనే ఈ మార్పులను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రయాణ ఖర్చులు రోజు రోజుకీ పెరుగుతున్న సందర్భంలో, బాటిల్ వాటర్ వంటి రోజువారీ వస్తువులపై స్వల్పమైన ధర తగ్గింపు ప్రయాణికులకు ఊరటగా ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే చిల్లర సమస్యలు రాకుండా ఉంటాయి, లేకపోతే పాత ధరకు బాటిల్ కొనాల్సి వస్తుంది. రైల్ నీర్ ధర తగ్గింపు భారతదేశం మొత్తం లక్షలాది మంది ప్రయాణికులకు ప్రత్యక్ష లాభం చేకూరుస్తుంది.