
GST 2.0: జీఎస్టీ భారత్'లో పండుగ కొనుగోళ్లకు ఊపునిస్తుందా?
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ శ్లాబుల్లో జరిగిన కొత్త మార్పులు కోట్లాది భారతీయులపై ఉన్న దినసరి ఆర్థిక భారం తగ్గించేలా మారనున్నాయి. ప్రధాన నిత్యావసర వస్తువులైన పాలు, బ్రెడ్‌తో పాటు జీవిత బీమా, ఆరోగ్య బీమా, ప్రాణాధార ఔషధాలపై పన్నును పూర్తిగా రద్దు చేశారు. చిన్న కార్లు, టెలివిజన్లు,ఎయిర్ కండిషనర్లపై ఇప్పటివరకు అమలులో ఉన్న 28% పన్నును 18%కు తగ్గించారు. అలాగే హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు వంటి వస్తువులపై 12% లేదా 18% బదులుగా కేవలం 5% మాత్రమే పన్ను విధిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ శ్లాబుల్లో ఈ సవరణలను ప్రకటించారు. ఈ మార్పులు పన్ను విధానాన్ని సరళీకృతం చేయడమే కాకుండా, కుటుంబ ఖర్చులు తగ్గించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వివరాలు
జీఎస్టీ రేట్లు తగ్గడం పండుగ సీజన్ కొనుగోళ్లకు అదనపు ఉత్సాహం
విజయదశమి సందర్భంగా ప్రజలు కొత్త వాహనాలు, దుస్తులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో జీఎస్టీ రేట్లు తగ్గడం పండుగ సీజన్ కొనుగోళ్లకు అదనపు ఉత్సాహం కలిగిస్తుందని భావిస్తున్నారు. పన్ను తగ్గింపు వల్ల వినియోగ వస్తువులైన ప్యాకేజ్డ్ ఫుడ్, దుస్తుల అమ్మకాలు ఈ నాలుగు నెలల్లో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
వివరాలు
వాహనాల అమ్మకాలకు ఊపు
అమెరికా విధించిన 50% సుంకాల ప్రభావాన్ని కూడా జీఎస్టీ సవరణలు కొంత మేర తగ్గించవచ్చని భావిస్తున్నారు. ప్రజల వద్ద డబ్బు మిగలడంతో కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఇచ్చిన రాయితీలు, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు, తాజాగా వచ్చిన జీఎస్టీ కోత అన్ని కలిసి వినియోగదారుల ఖర్చులను పెంచే దిశగా దోహదం చేస్తాయని భావిస్తున్నారు. రిలయన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందజేస్తూ అమ్మకాలు పెంచుకుంటున్నాయి. ఆగస్టులో మోదీ ప్రకటన తరువాత వాహన తయారీ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపాయి.
వివరాలు
30-40% వరకు అమ్మకాలు పెరిగే అవకాశం
దీంతో కార్ల కంపెనీల షేర్లు 6% నుంచి 17% వరకు పెరిగాయి. డీలర్ల ప్రకారం, వాహనాల గురించి విచారణ చేసే కస్టమర్ల సంఖ్య పెరిగింది. ముంబైలోని హీరో మోటోకార్ప్ డీలర్ ప్రముఖ మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 30-40% వరకు పెరగవచ్చని అంచనా. హీరో మోటోకార్ప్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ ప్రకారం, ధరలు తగ్గడంతో తొలిసారి బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఎక్కువగా విచారణ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విశాల్ పవార్ మాట్లాడుతూ.."పండుగ ఆఫర్లు, పన్ను కోత అన్ని కలిసి కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఈ దసరాకు నేను 200సీసీ బైక్ కొనాలని నిర్ణయించుకున్నాను" అన్నారు.
వివరాలు
వినియోగ వస్తువుల మార్కెట్ విస్తరణ
జీఎస్టీ తగ్గింపుతో వినియోగ వస్తువుల ఉత్పత్తి సంస్థలు కొనుగోళ్లు పెరుగుతాయని ఆశాభావంతో ఉన్నాయి. మంచి పంటలు రావడం కూడా మార్కెట్ విస్తరణకు తోడ్పడుతుందని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి సవ్యసాచి గుప్తా చెప్పారు. అయితే కంపెనీలు డిమాండ్ ఎంత పెరుగుతుందనే అనుమానంలో ఉండటంతో, ధరల తగ్గింపుకు సంబంధించిన లేబుళ్లను ముద్రించడంలో బిజీగా ఉన్నాయి. "పాత ధరలు-కొత్త ధరలు పక్కపక్కనే ముద్రించడం వల్ల వినియోగదారుడు ఎంత తగ్గిందో తేలికగా గ్రహిస్తాడు" అని గుప్తా వివరించారు. చిన్న బ్రాండ్లు, రిటైల్ దుకాణాలు మాత్రం తగ్గిన పన్నుల ప్రకారం ధరల మార్పు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తగిన సిబ్బంది లేకపోవడం వల్ల కొత్త ప్యాకేజింగ్ చేయడం ఆలస్యమవుతోంది.
వివరాలు
మార్కెట్‌లో అయోమయం
ముంబైలోని ప్రసిద్ధ క్రాఫోర్డ్ మార్కెట్‌లో పన్ను మార్పులపై కొద్ది మంది వ్యాపారులకు మాత్రమే అవగాహన ఉంది. వారిలోనూ అయోమయం కనబడుతోంది. టపాసుల వ్యాపారి షేక్ రెహమాన్ మాట్లాడుతూ.. తాను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసిన వస్తువుల ధరలను కొత్త శ్లాబుల ప్రకారం ఎలా మార్చాలో సరఫరాదారులతో చర్చిస్తున్నానని తెలిపారు. అయితే పక్కనే ఉన్న బ్రైడల్ షోరూమ్‌లో నిరాశ వాతావరణం కనిపిస్తోంది. 2,500 రూపాయల కంటే తక్కువ ధర ఉన్న దుస్తులపై పన్ను తగ్గించినా, ఎక్కువ ధర ఉన్న వాటిపై మాత్రం 18% జీఎస్టీ అమల్లోనే ఉంది. పెళ్లిళ్ల దుస్తులు ఎక్కువగా ఆ శ్రేణిలోనే ఉండటంతో, రాబోయే సీజన్‌లో అమ్మకాలు మందగించే అవకాశం ఉందని షోరూమ్ యజమాని నరేష్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఆర్థిక భారం-ప్రభుత్వ సవాళ్లు
క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం..జీఎస్టీ కోతలు మధ్య తరగతి ప్రజల నెలవారీ ఖర్చులో మూడో వంతు వరకు ఆదా చేసేలా ఉంటాయి. దీని వల్ల కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం తయారీ సంస్థలు ధరల తగ్గింపును వినియోగదారులకు ఎంతవరకు చేరుస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే జీఎస్టీ తగ్గింపు ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం నష్టమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వివరాలు
ఆర్థిక భారం-ప్రభుత్వ సవాళ్లు
మూడీస్ వంటి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో కేంద్ర పన్ను వసూళ్లు స్వల్పంగా పెరిగినా,ప్రభుత్వ ఖర్చులు 20% కంటే ఎక్కువగా పెరిగాయి. ఫలితంగా ఆర్థిక లోటును నియంత్రించేందుకు మౌలిక వసతుల ప్రాజెక్టులపై వ్యయాన్ని తగ్గించాల్సి రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.