
GST: జీఎస్టీ 2.0 సంస్కరణలు.. బంగారం, వెండిపై పన్ను రేటు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ కౌన్సిల్ బుధవారం జరిగిన 56వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో GSTలో విస్తృతమైన సంస్కరణలను ప్రకటించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నాలుగు శ్లాబ్ నిర్మాణం (5%, 12%, 18%, 28%) స్థానంలో ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. అంటే 5%, 18% మాత్రమే అమల్లో ఉంటాయి. అయితే హై-ఎండ్ కార్లు, పొగాకు, సిగరెట్లు వంటి కొన్ని ప్రత్యేక వస్తువులపై ప్రత్యేకంగా 40% శ్లాబ్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. 2017 జూలై 1న GST అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇదే అతిపెద్ద సంస్కరణగా పరిగణిస్తున్నారు.
Details
తక్కువ పన్ను శ్లాబ్ లోకి వచ్చే అవకాశం
దీంతో ఎక్కువ శాతం రోజువారీ గృహావసర వస్తువులు తక్కువ పన్ను శ్లాబ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత వీటి ధరలు మరింత చౌకయ్యే అవకాశం ఉంది. ఇక బంగారం, వెండి ఆభరణాలపై GST రేటు మాత్రం యథాతథంగా 3%వద్దనే కొనసాగుతుంది. అయితే తయారీ ఛార్జీలపై అదనంగా 5% GST చెల్లించాల్సి ఉంటుంది. బంగారు నాణేలు, కడ్డీలపైనా 3% GST వర్తిస్తుంది. దీంతో GST 2.0 సంస్కరణలు బులియన్ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, భారతదేశంలో 10 గ్రాముల బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే, మీరు బంగారం విలువపై 3% GSTతో పాటు తయారీ ఛార్జీలపై అదనంగా 5% GST చెల్లించాల్సిందే.