రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా
ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉంది. ఈ మేరకు దేశంలో చిన్న వ్యాపారాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం, మరోవైపు స్టార్టప్ వ్యవస్థల పెరుగుదల, కొత్తగా పెరుగుతున్న వ్యాపారాలు వెరసి జీఎస్టీ వసూలు దూసుకెళ్తోంది. ఈ మేరకు ఆగస్ట్ జీఎస్టీ వసూళ్లలో 11 శాతం వృద్ధి నమోదైంది. గత నెలకు సంబంధించి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు జరిగాయని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. వరుసగా జీఎస్టీ వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు దాటడం ఇది మూడోసారన్నారు. 2022 ఆగస్ట్ నెలలో రూ.1,43,612 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాబట్టామన్నారు. పన్ను ఎగవేతలు తగ్గుముఖం పట్టి, పన్ను చెల్లింపులు పెరుగుతున్న దృష్ట్యా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలవుతుందన్నారు.
జీఎస్టీ వసూళ్లలో 11 శాతానికి పైగా వృద్ధి నమోదు
2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని సంజయ్ మల్హోత్రా తెలిపారు. జీఎస్టీ ప్రారంభం నుంచి ఇదే ఆల్ టైం రికార్డు అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతంగా నమోదైంది. సాధారణ జీడీపీ రేటు కంటే జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగినట్లు ఆయన వివరించారు. జూన్ త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 11 శాతానికి పైగా వృద్ధి నమోదైందన్నారు. స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 1.3 శాతానికి పైగా పెరిగాయని చెప్పుకొచ్చారు. పన్ను వసూళ్ల పెరుగుదలకు అధికారుల పనితీరే కారణమని ప్రశంసించారు. పన్నులు పెంచకున్నా వసూళ్లు పెరిగాయన్నారు.