LOADING...
GST on petrol,diesel,alcohol: పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్‌పై జీఎస్టీ సంగతేంటి.. రేట్లు తగ్గాయా?
పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్‌పై జీఎస్టీ సంగతేంటి.. రేట్లు తగ్గాయా?

GST on petrol,diesel,alcohol: పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్‌పై జీఎస్టీ సంగతేంటి.. రేట్లు తగ్గాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన దేశంలో పరోక్ష పన్నుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కొత్త తరం సంస్కరణలను తీసుకొచ్చింది. జీఎస్టీ విధానం స్వరూపం పూర్తిగా మారింది. ఇప్పటికే ఉన్న నాలుగు శ్లాబులలో,రెండు శ్లాబులు రద్దు చేసినట్లు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3న ప్రకటించింది. ఈ నిర్ణయంతో కొన్ని వస్తువులు,సేవలపై 28శాతం ఉన్న జీఎస్టీ రేట్లు 18శాతానికి, 18,2 శాతం ఉన్న రేట్లు 5 శాతం,సున్నా శాతానికి తగ్గాయి. మొత్తం 375 రకాల వస్తువులపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గింది. ఈ మార్పుల నేపథ్యంలో, వివిధ కంపెనీలు తమ వస్తువుల ధరలను కూడా కొత్త రేట్ల ప్రకారం ప్రకటించడం మొదలుపెట్టాయి. సెప్టెంబర్ 22 నుండి కొత్త జీఎస్టీ రేట్లతో తగ్గించిన ధరల వస్తువులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

వివరాలు 

99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబులోకి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంస్కరణల వల్ల ప్రజలకు పన్ను రూపంలో ఇప్పుడు చెల్లించాల్సిన డబ్బు తగ్గి మిగులుతుందని ఇటీవల వెల్లడించారు. దీని ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతూ, వినియోగం ఎక్కువవ్వడంతో ఆర్థిక వ్యవస్థలో దాదాపు రూ. 2 లక్షల కోట్లు ప్రవేశిస్తాయని అంచనా వేశారు. 12 శాతం శ్లాబులో ఉన్న వస్తువులలో దాదాపు 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబులోకి చేరాయి. అలాగే, 28 శాతం శ్లాబులో ఉన్న వస్తువులలో 90 శాతం వరకు వస్తువులు 18 శాతం శ్లాబులోకి చేరాయి. అయితే సిగరెట్, పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు వంటి కొన్ని వస్తువులపై ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీ అమలు చేశారు.

వివరాలు 

పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం

ఈ క్రమంలోనే.. అన్నింటిపై ధరలు తగ్గుతుండగా.. జనం పెట్రోల్, డీజిల్ సహా మద్యం ధరలు తగ్గుతున్నాయా అని చూస్తున్నారు. నిజానికి వీటిపై జీఎస్టీ రేట్లు వర్తించవు. కాబట్టి జీఎస్టీ సవరణల వల్ల వీటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. పెట్రోల్, డీజిల్: ఈ ఇంధనాలు జీఎస్టీ పరిధిలో లేవు. కేంద్ర ప్రభుత్వం ఈ ఇంధనాలపై ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి. ఈ పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం వస్తుంది. అందుకే రాష్ట్రాలు ఇవి జీఎస్టీ పరిధిలోకి రావడంలో ఆసక్తి చూపించలేదు.

వివరాలు 

ఆల్కహాల్‌పై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఉంది 

మద్యం: ఆల్కహాల్‌పై పన్ను విధించే అధికారం పూర్తిగా రాష్ట్రాలకు ఉంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో మద్యం ద్వారా ఎక్కువ వసూళ్లు పొందుతాయి. కాబట్టి, మద్యంపై జీఎస్టీ అమలు చేయలేదు. వీటి ధరలు తగ్గాలంటే, కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలి లేదా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలి. ఉదాహరణకు, హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 కాగా, కొన్ని చోట్ల రూ. 95.70 వరకు ఉంది.