Loading...
GST registration: వ్యాపారులకు ఊరట.. ఇక ఆన్‌లైన్‌లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు!
వ్యాపారులకు ఊరట.. ఇక ఆన్‌లైన్‌లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు!

GST registration: వ్యాపారులకు ఊరట.. ఇక ఆన్‌లైన్‌లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 2026 డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం 2017 నాటి జీఎస్టీ నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

కొత్త విధానంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ఎలా?

కొత్త నిబంధనల ప్రకారం జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలనుకునే వ్యాపారులు ముందుగా తమ చివరి పన్ను కాలానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయాలి.

అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, ఇతర బకాయిలను పూర్తిగా చెల్లించాలి.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జీఎస్టీ ఆన్‌లైన్ పోర్టల్‌లో రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత ఉన్న దరఖాస్తులను అధికారుల జోక్యం లేకుండానే పోర్టల్ ద్వారా ఆటోమేటిక్‌గా రద్దు చేస్తారు.

దరఖాస్తులో పేర్కొన్న తేదీ నుంచే రిజిస్ట్రేషన్ రద్దు అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులకు 'ఫామ్ జీఎస్టీ ఆర్ఈజీ-38' (FORM GST REG-38) ద్వారా ఆన్‌లైన్‌లోనే తెలియజేస్తారు.

వివరాలు 

ఏ సందర్భాల్లో అధికారుల పరిశీలన తప్పనిసరి?

దరఖాస్తుదారులు తమ పన్ను రిటర్నులను సక్రమంగా దాఖలు చేయకపోయినా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు బకాయి ఉన్నా ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ రద్దు కాదు.

పన్నులతో పాటు వడ్డీలు, జరిమానాలు చెల్లించాల్సి ఉన్నా సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలిస్తారు.

అన్ని రిటర్నులు దాఖలు చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా క్లియర్ చేసినప్పుడే సులభంగా ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ మార్పులు

కొత్తగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించింది.

దరఖాస్తు ఫామ్ నింపే సమయంలో తప్పులు జరగకుండా ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు కనిపించేలా పోర్టల్‌లో మార్పులు చేసింది.

పత్రాలను సులభంగా అప్‌లోడ్ చేసేందుకు డ్రాప్‌డౌన్ బాక్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

అంతేకాకుండా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు పూర్తి ప్రక్రియను సులభంగా అర్థం చేసుకునేందుకు జీఎస్టీ వెబ్‌సైట్‌లోని 'హెల్ప్' విభాగంలో ప్రత్యేక మార్గదర్శకాలను పొందుపరిచింది.

ఇందులోని 'జీఎస్టీ నాలెడ్జ్ పోర్టల్' ద్వారా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను దశలవారీగా తెలుసుకోవచ్చు.

దీంతో కొత్త రిజిస్ట్రేషన్, పాత రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియలు మరింత సులభతరం కానున్నాయి.

ADVERTISEMENT