
Microsoft: హెచ్-1బీ వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రండి.. మైక్రోసాఫ్ట్ కీలక సూచన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా పెంచే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన నేపథ్యంలో ప్రపంచ టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఈ నూతన నిబంధనలు సెప్టెంబర్ 21 నుండి అమల్లోకి రానున్నాయి. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు తమ పనిని కొనసాగించేందుకు త్వరితగతిన యూఎస్‌కు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు సూచించింది. రాయిటర్స్ ప్రకారం, అంతర్గత ఈమెయిల్ ద్వారా ఈ అడ్వైజరీని పంపగా, అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడికే పని కొనసాగించాలని కంపెనీ సూచించింది.
Details
ఏడాదికి లక్ష డాలర్లు
అదేవిధంగా ఫేస్‌బుక్/మెటా కూడా తమ ఉద్యోగులకు స్పష్టత వచ్చే వరకు కనీసం రెండు వారాలపాటు అమెరికా వెలుపల ఉండకూడదని హెచ్చరించింది. ఇతర కంపెనీలు, అమెజాన్, జేపీ మోర్గాన్ కూడా ఇదే విధమైన సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ఈ కొత్త విధాన ప్రకారం సెప్టెంబర్ 21 నుండి హెచ్-1బీ వీసా దరఖాస్తు చేసుకునే లేదా ఇప్పటికే ఉన్న ఉద్యోగులు అమెరికాలో ప్రవేశించాలంటే ప్రతి ఒక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీన్నిబట్టి ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ప్రాజెక్టులలో ఉంచడంలో అప్రమత్తమవుతున్నాయి.
Details
కొనసాగుతున్న లాటరీ విధానం
ప్రస్తుతంలో హెచ్-1బీ వీసాదారుల కోసం లాటరీ విధానం కొనసాగుతోంది. దరఖాస్తు చేసిన వారు మొదట సాధారణ ఛార్జీలు చెల్లిస్తారు. లాటరీలో ఎంపిక అయితే అదనపు రుసుములు చెల్లించాలి, సాధారణంగా కంపెనీలు ఇవి భరిస్తాయి. అయితే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం కంపెనీలపై భారీ భారంగా మారనుంది, అందువల్ల టెక్ సంస్థలు తమ ఉద్యోగులను తక్షణమే అప్రమత్తం చేస్తున్నాయి.