Gold: గోల్డ్ కొనేవారికి ప్రభుత్వం శుభవార్త.. గోల్డ్ బులియన్‌కి కొత్త రూల్స్
భారతదేశంలో బంగారాన్ని చాలా మంది అత్యంత ముఖ్యమైన ఆస్తిగా పరిగణిస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు బంగారు కడ్డీలు, నాణేలు కొనుగోలు చేయడం ద్వారా తమ పెట్టుబడులు పెడుతుంటారు. వీరు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గోల్డ్ బులియన్‌కి సంబంధించి కొత్త నియమాలు తీసుకువస్తోంది. ఈ కొత్త రూల్ ప్రకారం, ప్రతి గోల్డ్ బార్, బిస్కెట్ లేదా కాయిన్ మీద హాల్‌మార్క్ ముద్ర ఉండడం తప్పనిసరి. ఇది బంగారం నాణ్యతకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. జనవరి నుండి ఈ నియమం అమల్లోకి రానుంది, అప్పుడు మార్కెట్లో ఉన్న ప్రతి గోల్డ్ బార్ లేదా బిస్కెట్ మీద ఈ హాల్‌మార్క్ ఉండాలి.
గోల్డ్ హాల్‌మార్క్ అనేది ఏమిటి?
గోల్డ్ హాల్‌మార్క్ అనేది బంగారం స్వచ్ఛతకు సంబంధించిన సర్టిఫికేషన్. దీని ద్వారా బంగారం ఎంత స్వచ్ఛంగా ఉందో తెలియజేస్తారు. ఈ రూల్ భారతదేశంలోకి వచ్చే అన్ని గోల్డ్ బార్స్, కాయిన్స్‌కి కూడా వర్తిస్తుంది. ఈ నియమాన్ని క్రమంగా దేశవ్యాప్తంగా అమలు చేయడం ప్రారంభిస్తారు.
బంగారు ఆభరణాల హాల్‌మార్క్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారి ప్రకారం, వచ్చే ఏడాది నుండి భారతదేశంలో అమ్మే ప్రతి గోల్డ్ బార్, బిస్కెట్, కాయిన్ పై హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతుంది. ఇది బంగారం నాణ్యతను,స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. ఈ రూల్ దేశంలోకి వచ్చే ప్రతి గోల్డ్ బార్ విషయంలోనూ వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించింది.
హాల్‌మార్క్ వల్ల లాభాలు
BIS హాల్‌మార్కింగ్ నియమాలను అమలు చేస్తుంది. కొత్త నియమం ప్రకారం, నగల వ్యాపారులు తమ సొంత నగలు తయారు చేయడానికి వాడే బంగారు కడ్డీలకు హాల్‌మార్క్ అవసరం లేదు. టెస్ట్ కేంద్రాలు బంగారాన్ని పరీక్షించి హాల్‌మార్క్ ముద్ర వేస్తాయి.
భారతదేశంలో బంగారం కొనుగోలు స్థాయిలు
"నగల నాణ్యతను మెరుగుపరచడం కోసం, గోల్డ్ బిస్కెట్‌లపై హాల్‌మార్క్ ముద్రను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే, ఎక్కువగా బంగారం కడ్డీలు, బిస్కెట్లు ఉపయోగించి నగలు తయారు చేస్తారు. హాల్‌మార్క్ వల్ల బంగారం స్వచ్ఛతను నిర్ధారించుకోవచ్చు" అని BIS డైరెక్టర్ జనరల్ తివారి అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే దేశంగా ఉంది. ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు తివారి చెప్పారు.