WEF: ఎర్ర సముద్రంలో సంక్షోభం.. భారత్‌లో చమురు ధరల్లో పెరుగుదల: వరల్డ్ ఎకనామిక్ ఫోరం
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై పదేపదే దాడులు చేయడంతో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్గే బ్రెండే పేర్కొన్నారు. ఫలితంగా భారతదేశం వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై తీవ్రమైన ప్రభావం ఉటుందని వెల్లడించారు. ఉద్రిక్తతల వల్ల ఎర్ర సముద్రాన్ని మూసివేస్తే ప్రతికూల ప్రభావం చూపడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు. సూయజ్ కెనాల్‌ను వారాలపాటు మూసివేయడం కూడా ప్రపంచ సరఫరాపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. దీని వల్ల చమురు ధరలు పెరుగుతాయని, ఫలితంగా భారతదేశం వంటి పెద్ద చమురు దిగుమతి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది 8శాతం భారత ఆర్థిక వృద్ధి
ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు అతి త్వరలో ఆగిపోతాయని బోర్గే బ్రెండే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వాణిజ్యం ఈ సంవత్సరం పుంజుకునే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై బోర్డే ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ ఏడాది 8 శాతం వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రెండు దశాబ్దాల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ పయనిస్తుందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ రెండింతలు వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. డిజిటల్ ఎకానమీ, సేవల ఎగుమతుల కారణంగా భారత్ ముందంజలో ఉందని బ్రెండే చెప్పారు. ఇది భారతదేశానికి చాలా మంచి అవకాశం అన్నారు.