Meesho: సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా ఆన్‌లైన్ ఉత్పత్తుల సంస్థ మీషో.. రూ.5 కోట్లకు పైగా నష్టం
ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యం అందుబాటులో ఉండడంతో, ఇప్పుడు ఎలాంటి వస్తువునైనా సులభంగా ఆర్డర్ చేయగలుగుతున్నాము. కొన్ని ఈ కామర్స్ సంస్థలు, వస్తువు నచ్చకపోయినా లేదా నాణ్యత లోపం ఉన్నా, రిటర్న్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్న సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడ్డారు. ఈసారి వారు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ "మీషో" (Meesho)ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మోసంతో కంపెనీకి రూ. 5 కోట్లకుపైగా నష్టం జరిగింది. కొంతమంది సైబర్ నేరగాళ్లు మీషోలో విక్రేతలుగా ఉన్నారు. వారే కొనుగోలుదారులుగా ఫేక్ అకౌంట్ల నుంచి వస్తువులను ఆర్డర్ చేసేవారు.
జనవరి నుంచి జులై వరకు రూ. 5.5 కోట్ల వరకు దోచుకున్నారు
వారు మంచి వస్తువులను స్వీకరించి, పాత, నష్టమైన వస్తువులతో వాటిని భర్తీ చేసి, రిటర్న్ పెట్టేవారు. వారు దీనికి సంబంధించి వీడియోలను కూడా సాక్ష్యంగా అందించేవారు. ఇలా నాణ్యత లేని వస్తువులను కంపెనీకి ఇచ్చి, డబ్బును తిరిగి పొందేవారు. ఈ రకమైన మోసంతో ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు రూ. 5.5 కోట్ల వరకు దోచుకున్నారు. ఈ విషయంలో ఆందోళన చెందిన సంస్థ ఒక అధికారి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా,ఈ మోసం వెలుగు చూడటానికి కారణమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.