AI to Transform India's Tourism: పర్యాటక రంగంలో ఏఐ విప్లవం.. ఇన్‌మొబీతో కేంద్రం ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ, దేశంలో తొలి యూనికార్న్ అయిన ఇన్‌మొబీ కృత్రిమ మేధ (AI)ను వినియోగించనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 27న నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో ఇన్‌మొబీ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇన్‌మొబీకి చెందిన ఏఐ ఆధారిత కంటెంట్ ప్లాట్‌ఫామ్ 'గ్లాన్స్'తో కలిసి భారత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి దేశంలోని పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేందుకు డిజిటల్ కార్యక్రమాలను చేపట్టనుంది.
వివరాలు
ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రాంతీయ పర్యాటక సర్క్యూట్లతో అనుసంధానం
ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సమీపంలోని ఇతర ఆకర్షణీయ ప్రదేశాలతో అనుసంధానించనున్నారు.
ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను సందర్శించే వారు అక్కడితోనే ఆగిపోకుండా సమీపంలోని వారసత్వ పట్టణాలు,హస్తకళల గ్రామాలు,ప్రకృతి ప్రాంతాలను కూడా సందర్శించేలా ప్రోత్సహించనున్నారు.
తద్వారా పర్యాటకులు తమ బసను మరింత పొడిగించే అవకాశం ఉంటుంది.
"ఒక ప్రముఖ చారిత్రక కట్టడాన్ని సందర్శించే ప్రయాణం..సమీపంలోని వారసత్వ ప్రాంతం, హస్తకళల గ్రామం, స్థానిక ఆహార కేంద్రం లేదా ప్రకృతి సంరక్షణ ప్రాంతాన్ని తెలుసుకునేందుకు అవకాశం కల్పించాలి. పర్యాటకం ద్వారా వచ్చే ప్రయోజనాలు స్థానిక గైడ్లు, కళాకారులు, హోమ్‌స్టేలు, చిన్న వ్యాపారాలకు నేరుగా చేరేలా చేయడమే మా ప్రధాన లక్ష్యం" అని ఇన్‌మొబీ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబీ చతుర్వేది తెలిపారు.
వివరాలు
దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని సమతుల్యంగా విస్తరించడమే లక్ష్యం
పర్యాటక రంగాన్ని కొన్ని ప్రముఖ ప్రాంతాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించడంపైనా ఇన్‌మొబీ-పర్యాటక శాఖ భాగస్వామ్యం దృష్టి సారించనుంది.
"ప్రయాణికులు ఒకే జాబితాలో ఉన్న ప్రాంతాలకే పరిమితం కాకుండా.. మన దేశంలో చూడదగ్గ అద్భుతమైన, అంతగా తెలియని ప్రదేశాలను కూడా అన్వేషించేలా ప్రేరేపించాలనుకుంటున్నాం" అని చతుర్వేది పేర్కొన్నారు.
అధిక రద్దీ ఉండే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలపై ఒత్తిడిని తగ్గించి, తక్కువగా తెలిసిన ప్రాంతాల వైపు పర్యాటకులను మళ్లించడం ద్వారా స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులకు ఊతం లభిస్తుందని సంస్థ భావిస్తోంది.
వివరాలు
గమ్యస్థానాల సాంస్కృతిక కథనాలను ప్రజలకు చేరువ చేయాలి
వారసత్వ పర్యాటకం ఈ కార్యక్రమంలో ప్రధాన అంశంగా ఉంటుందని చతుర్వేది తెలిపారు.
ఇన్‌మొబీ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ ఆఫీసర్‌గానూ వ్యవహరిస్తున్న ఆమె.. ఆయా ప్రాంతాల చారిత్రక నిర్మాణాలు, ఆధ్యాత్మిక నేపథ్యం, స్థానిక హస్తకళలు, ఆహార ప్రత్యేకతలు, అక్కడి సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యమన్నారు.
ప్రసిద్ధ కట్టడాలకే కాకుండా.. అంతగా తెలియని స్థానిక ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రత్యేకతలను కూడా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు.
వివరాలు
బాధ్యతాయుతమైన పర్యాటకానికీ ప్రాధాన్యం
బాధ్యతాయుతమైన ప్రయాణ విధానాలను ప్రోత్సహించడం కూడా ఈ ఒప్పందంలోని మరో ముఖ్య అంశం.
కంటెంట్ కార్డుల ద్వారా పర్యాటక ప్రాంతాల్లో చెత్త వేయడం, చారిత్రక కట్టడాలను పాడుచేయడం, వాటిపై రాతలు రాయడం వంటి చర్యలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించనున్నారు.
స్మారక చిహ్నాలు, వారసత్వ ప్రాంతాల్లో గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించనున్నారు.
కొత్త పర్యాటక ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యతపై కూడా అవగాహన కల్పించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.
పండుగలు, జాతీయ ప్రాధాన్య కార్యక్రమాలు, అంతర్జాతీయ వేడుకల సందర్భంగా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇన్‌మొబీ, పర్యాటక శాఖ సంయుక్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
వివరాలు
'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' ద్వారా గమ్యస్థానాలకు ప్రచారం
దాదాపు 30 కోట్ల మంది వినియోగదారులు ఉన్న గ్లాన్స్.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉండే స్మార్ట్ లాక్‌స్క్రీన్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తోంది.
ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే తాజా వార్తలు, వాతావరణ సమాచారం, గేమ్స్, ఏఐ ఆధారిత షాపింగ్ సూచనలను ఇది అందిస్తుంది.
ఈ సాంకేతికతను ఉపయోగించి దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలతో పాటు అంతగా తెలియని గమ్యస్థానాలను కూడా లక్షలాది మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు పరిచయం చేయనున్నారు.
పర్యాటక మంత్రిత్వ శాఖ కంటెంట్, ఆడియో-విజువల్ సమాచారాన్ని అందించనుండగా.. గ్లాన్స్ వాటిని ఎంపిక చేసి 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' పేరుతో వినియోగదారులకు చేరవేయనుంది.