Hormuz blockade: ట్రంప్ హర్మూజ్ దిగ్బంధనం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు మొదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి. యుద్ధానికి ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్న ధర, తరువాతి రోజుల్లో 115 డాలర్లకు పైగా చేరింది. అయితే యుద్ధ విరామం ప్రకటించడంతో కొంత తగ్గినా,మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ధరలు 100 డాలర్ల దరిదాపుల్లో కదలాడింది. తాజాగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమవడంతో హర్మూజ్ మార్గాన్ని దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ దిగ్బంధనం ఎక్కువకాలం కొనసాగితే, ముడిచమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశముందని చమురు విశ్లేషణ సంస్థ ఆనిక్స్ క్యాపిటల్ గ్రూప్ వెల్లడించింది.
వివరాలు
ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం
ప్రస్తుతం ధరలు 99 డాలర్ల వద్ద ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి ప్రభావం ఇంకా పూర్తిగా కనిపించలేదని సంస్థ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత క్షీణిస్తే ధరలు 140 నుంచి 150 డాలర్ల వరకు చేరే అవకాశముంది. హర్మూజ్ మార్గం దిగ్బంధిస్తే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోవచ్చు. ఇది ప్రాంతీయ ఘర్షణను ప్రపంచ స్థాయి యుద్ధంగా మార్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం వల్ల ఆసియా, దక్షిణ పసిఫిక్ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
వివరాలు
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఒకవేళ అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే, ఈ సంవత్సరం ముగిసేలోపు ధరలు 100 డాలర్ల వద్ద స్థిరపడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. భారత్ తన ముడిచమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. చమురు ధరలు పెరగడం వల్ల గత ఏడాది 150 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇంధన వ్యయం, ప్రస్తుతం పరిస్థితులు కొనసాగితే 250 బిలియన్ డాలర్లకు చేరే ప్రమాదం ఉంది. బ్యారెల్ ధర 120 నుంచి 140 డాలర్లకు చేరితే రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం అధికమవుతుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఎర్ర సముద్రం,ఒమన్ అఖాతం మార్గాల్లో ఆటంకాల కారణంగా భారత ఎగుమతుల్లో దాదాపు 20 శాతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వివరాలు
షేర్ మార్కెట్, రూపాయి పరిస్థితి
ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవడంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 1,600 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా 23,600 దిగువకు చేరింది. తరువాత కొంత కోలుకున్నప్పటికీ, పెట్టుబడిదారుల నమ్మకం ఇంకా బలహీనంగానే ఉంది. చమురు ధరలు పెరిగే కొద్దీ రూపాయి విలువపై ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
గల్ఫ్ దేశాల్లో భారతీయులపై ప్రభావం
గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ఇప్పటికే 9 లక్షల మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో పనులు తగ్గడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రవాస భారతీయులు పంపే నగదు ప్రవాహం కూడా తగ్గే అవకాశం ఉంది. కేరళ వంటి రాష్ట్రాలకు ఇది గణనీయమైన దెబ్బగా మారొచ్చు.
వివరాలు
ప్రపంచ మార్కెట్ల దుస్థితి
ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న హర్మూజ్ మార్గం మూసివేతతో భారీ కొరత ఏర్పడింది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు కూడా దాదాపు 1 శాతం నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి గతంలో చోటుచేసుకున్న చమురు సంక్షోభాల కంటే కూడా తీవ్రమైనదిగా మారే అవకాశముంది. అస్థిర పరిస్థితుల్లో సామాన్య పెట్టుబడిదారులు తక్షణ లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.