HPCL, BPCL to IOCL: పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగినా.. భారీగా పతనమైన OMC షేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) షేర్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL),భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL),ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) షేర్లు 2.6 శాతం వరకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన కొనసాగుతోంది. బీఎస్‌ఈలో HPCL షేర్ 2.65 శాతం పడిపోయి రూ.367.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. BPCL షేర్ 2 శాతం తగ్గి రూ.289.05కు చేరగా.. IOCL షేర్ 0.6 శాతం క్షీణించి రూ.139.35 వద్ద ట్రేడ్ అయింది.
వివరాలు
మరింత పెరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా పెంపు లేకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒకేసారి భారీగా ధరలు పెంచకుండా దశలవారీగా పెంచే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. దీంతో ద్రవ్యోల్బణంపై ఒక్కసారిగా ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడుతోందని చెప్పారు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 107డాలర్లకు చేరువగా ట్రేడ్ అవుతోంది. కేవలం ఈ వారంలోనే దాదాపు 6శాతం పెరుగుదల నమోదైంది.వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(WTI) క్రూడ్ కూడా 102డాలర్లకు పైగా కొనసాగుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్లలో ఆందోళన పెంచాయి.
వివరాలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై భారీ ఆర్థిక భారం
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోర్ముజ్ జలసంధి తెరిచి ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ఎనర్జీ మార్కెట్లు మరింత అస్థిరంగా మారాయి. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ కంపెనీలు మార్చలేదు. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడింది. అధికారిక అంచనాల ప్రకారం ప్రతి లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ.20, డీజిల్‌పై రూ.100 వరకు నష్టాలు వస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కు, డీజిల్ ధర రూ.90.67కు చేరింది.
వివరాలు
ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన ఇంధన ధరలు
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.108.74 కాగా.. డీజిల్ ధర రూ.95.13కు పెరిగింది. చెన్నైలో కూడా పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.95.25గా నమోదయ్యాయి. మార్చి 2024 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇదే తొలి మార్పు. అంతకుముందు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు లీటరుకు రూ.2 చొప్పున ధరలు తగ్గించారు. తాజాగా అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరగడం రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది.